Shambhavi Pathak: అమ్మమ్మకు పంపిన ఆ ‘గుడ్ మార్నింగ్’ సందేశమే ఆఖరిది.. విమాన ప్రమాదంలో యువ పైలట్ విషాదాంతం!

Shambhavi Pathak Last Message to Grandmother Before Plane Crash
  • బారామతి ప్రమాదంలో పైలట్ శాంభవి మృతి 
  • విమానం కూలడానికి కొన్ని గంటల ముందే అమ్మమ్మకు మెసేజ్  
  • తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ 
  • న్యూజిలాండ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న శాంభవి
  • లండన్, రష్యా వంటి దేశాలకు విమానాలు నడిపిన ప్రతిభావంతురాలు
బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

గ్వాలియర్‌లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నారు. "బుధవారం ఉదయం శాంభవి నుంచి నాకు 'గుడ్ మార్నింగ్' అని మెసేజ్ వచ్చింది. సాధారణంగా ఆమె అంతగా మెసేజ్‌లు చేయదు, కానీ ఆ రోజు ఎందుకో చేసింది. అదే తన నుంచి వచ్చిన ఆఖరి మాట అని ఊహించలేదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శాంభవి ఇక లేదన్న వార్త ఆమెకు చేరింది.

శాంభవి తండ్రి విక్రమ్ పాఠక్ భారత వైమానిక దళంలో రిటైర్డ్ పైలట్. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న శాంభవి, న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ శిక్షణ పూర్తి చేసింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఢిల్లీ, లండన్, రష్యా వంటి అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడిపి తన ప్రతిభను చాటుకుంది. చిన్నతనంలో గ్వాలియర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్కూల్‌లో చదివిన ఆమె, ఎప్పుడు నగరానికి వచ్చినా తన అమ్మమ్మను కలవకుండా వెళ్లేది కాదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు కెప్టెన్ సుమిత్ కపూర్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్‌లు ఈ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. శాంభవి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఆమె తండ్రి పూణె చేరుకున్నారు. ఒక తెలివైన, చురుకైన యువ పైలట్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం గ్వాలియర్‌లోని ఆమె పొరుగువారిని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. 
Shambhavi Pathak
Baramati plane crash
Ajit Pawar
pilot death
aviation accident
Maharashtra
Gwalior
flight attendant
Sumit Kapoor
aviation

More Telugu News