Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Ram Prasad Reddy Announces 750 Electric Buses for Andhra Pradesh
  • విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి సమీక్షించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారన్న మంత్రి
  • అధునాతన సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్‌ బస్సులు త్వరలో అందుబాటులో వస్తాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో నిన్న స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వం భారంగా కాకుండా, ప్రజల పట్ల బాధ్యతగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈ విజయానికి 48 వేల మంది ఆర్టీసీ సిబ్బంది కృషే ప్రధాన కారణమని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రెట్రోఫిట్మెంట్‌ బస్సులపై పరిశీలన కొనసాగుతోందని, అధునాతన సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్‌ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. పల్లెవెలుగు సర్వీసుల్లోనూ ఏసీ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. 

మహిళలు ఉచితంగా ప్రయాణించేలా అన్ని ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిష్కారం కాని అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. టికెట్‌ ఆదాయంపైనే ఆధారపడకుండా ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం ఆర్జించిందని మంత్రి వెల్లడించారు. కార్గో ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా అధికారులను ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలతో సత్కరించారు. అనంతరం విజయవాడ బస్టాండ్‌లోని కార్గో సర్వీసు నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 
Ram Prasad Reddy
APSRTC
electric buses
Andhra Pradesh
free travel for women
Sthree Sakthi scheme
Dwaraka Tirumala Rao
cargo services
Chandrababu Naidu
public transport

More Telugu News