వివాదంలో జన నాయగన్ మూవీ.. ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసన్న విజయ్ తండ్రి!

  • విజయ్ 'జన నాయగన్' మూవీకి న్యాయపరమైన అడ్డంకులు
  • రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో ఇలాంటి అవరోధాలు సహజమేనన్న విజయ్ తండ్రి చంద్రశేఖర్
  • తన కొడుకు ఎలాంటి సవాళ్లకూ భయపడే వ్యక్తికాదని వెల్లడి
  • అనుకున్న సమయానికి ‘జన నాయగన్‌’ ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసునని వ్యాఖ్య
విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ మూవీ వివాదాల్లో చిక్కుకుని విడుదల కోసం ఎదురుచూపుల్లో ఉంది. ఈ నెల 9న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులతో వరుసగా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదల జాప్యంపై విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

విజయ్‌ ఎలాంటి సవాళ్లకూ భయపడే వ్యక్తి కాదని, ఎదురయ్యే ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొనే నాయకత్వ లక్షణం తన కుమారుడికి ఉందని ఆయన స్పష్టం చేశారు. కరూర్‌లో జరిగిన పరిణామాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. విజయ్‌ దేనికీ భయపడడని చెప్పారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో ఇలాంటి అవరోధాలు సహజమేనని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ‘జన నాయగన్‌’ ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసునన్నారు. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువత రాజకీయాలపై చర్చ మొదలుపెట్టిందని,  ఈ విషయంలో తన కంటే వారికి స్పష్టత ఎక్కువగా ఉందని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండగా, ‘జన నాయగన్‌’కు యు/ఏ సర్టిఫికెట్‌ జారీ చేయాలని జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సెన్సార్‌ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించగా, విచారణ జరిపిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధించింది. 

ఈ స్టేపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం… మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. జనవరి 21న సుదీర్ఘ వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌ మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్‌ బెంచ్‌ను తాజాగా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘జన నాయగన్‌’ మూవీ రిలీజ్‌కు ‌ మరింత ఆలస్యం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


More Telugu News