Nara Lokesh: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి.. విధివిధానాలపై లోకేశ్ చర్చ

Nara Lokesh Discusses Keeping Children Away From Social Media
  • సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ప్రాన్స్‌లోని విధానాలను అధ్యయనం చేయాలన్న లోకేశ్
  • సుప్రీంకోర్డు గైడ్ లైన్స్‌ను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలన్న మంత్రి
  • ఫేక్ న్యూస్, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు కట్టడి చేయాలన్న మంత్రి
నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై సచివాలయంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమావేశానికి మంత్రి లోకేశ్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌ను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మలేషియాలో మై డిజిటల్ ఐడీ, పాస్ పోర్టు వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం ద్వారా 16సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని వెల్లడించారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలన్న విషయమై మంత్రుల బృంద సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎంత వయోపరిమితి విధించాలనే విషయమై వివిధ దేశాల్లో చట్టాలను పరిశీలించాల్సిందిగా మంత్రుల బృందం అధికారులకు సూచించింది. 

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. దీనిపై చర్చించేందుకు గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కంప్లయన్స్ ఆఫీసర్లను కూడా వచ్చే జీవోఎం సమావేశానికి రప్పించాలని సూచించారు.

సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్-46 ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రప్రభుత్వ అధీనంలోని సహయోగ్ పోర్టల్ ద్వారా కొన్ని కేసుల విషయంలో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంప్యూటర్ రిలేటెడ్ ఎఫెండర్స్, సైబర్ లా ఎఫెండర్స్ కట్టడి, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశంలో ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, హోంమంత్రి వంగలపూడి అనిత, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఆకే రవికృష్ణ (ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్), పి.కిరణ్ కుమార్ (జాయింట్ డైరెక్టర్, ఐ అండ్ పీఆర్), పి.జయరావు, చీఫ్ జనరల్ మేనేజర్ (సోషల్ మీడియా & డిజిటల్ మీడియా, డిజిటల్ కార్పోరేషన్), ఒ.మధుసూదన (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, ఐ &పీఆర్), ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Social Media
Children
Minors
Fake News
Cyber Crime
IT Act
Andhra Pradesh
Naadendla Manohar

More Telugu News