Medaram Jatara: మేడారంలో భక్తులకు ధరల షాక్.. ఆకాశాన్నంటిన రేట్లు.. చెట్టు నీడకూ అద్దె వసూలు!

Sammakka Saralamma Jatara Price Hike Angers Devotees
  • ప్రారంభమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర
  • భక్తులను బెంబేలెత్తిస్తున్న ఆకాశాన్నంటిన ధరలు
  • కోళ్లు, మేకల ధరలు రెట్టింపు.. గదుల అద్దెలు వేలల్లో
  • చెట్టు కింద నీడకు కూడా అద్దె వసూలు చేస్తున్న వైనం
  • ధరల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని భక్తుల విజ్ఞప్తి
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ధరల మోత తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జాతర పరిసరాల్లో నిత్యావసరాల నుంచి బస చేసే గదుల వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోడి, మేకల ధరలు రెట్టింపు.. భక్తుల జేబులకు చిల్లు
జాతరలో అమ్మవార్లకు మొక్కుగా బెల్లం(బంగారం)తో పాటు కోళ్లు, మేకలను సమర్పించడం ఆనవాయితీ. దీన్నే అదునుగా చేసుకున్న వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేశారు. సాధారణంగా కిలో రూ. 420 పలికే మేకపోతు లైవ్, మేడారంలో రూ. 900 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. ఇక, మటన్ ధర అయితే ఏకంగా రూ. 1500కు చేరింది. బయట మార్కెట్‌లో కిలో రూ. 170-180 ఉండే బ్రాయిలర్ కోడిని ఇక్కడ రూ. 300 నుంచి రూ. 350కి అమ్ముతున్నారు. నాటుకోడి ధర రూ. 700 దాటిపోయింది. జాతర చివరి రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు.

చుక్కలు చూపిస్తున్న గదుల అద్దెలు  
మాంసం ధరలే కాకుండా, బస కోసం ఏర్పాటు చేసుకునే గదుల అద్దెలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేని చిన్న గదులకు సైతం రోజుకు రూ. 6,000 వరకు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క ఫ్యాన్ మాత్రమే ఉన్న గదికి వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది.

చెట్ల కింద నీడకు సైతం అద్దె
ఇక ఇళ్లు, గదులు దొరకని వారు సేద తీరేందుకు చెట్ల నీడను ఆశ్రయిస్తుంటే, అక్కడ కూడా దోపిడీ తప్పడం లేదు. జాతర పరిసరాల్లోని తోటల యజమానులు చెట్ల కింద నీడను సైతం అద్దెకు ఇస్తున్నారు. ఓ కుటుంబం వంట చేసుకుని, భోజనం చేయడానికి ఒక చెట్టు కింద నీడ కోసం రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికంగానే కొనుగోలు చేయాల్సి రావడంతో, వ్యాపారులు ఈ విధంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Medaram Jatara
Sammakka Saralamma Jatara
Telangana Kumbh Mela
Medaram
Sammakka
Saralamma
Jatara prices

More Telugu News