Aroori Ramesh: కడియం శ్రీహరి కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయా: బీఆర్ఎస్‌లో చేరిన ఆరూరి రమేశ్

Aroori Ramesh Joins BRS Blames Kadiyam Srihari for Exit
  • అనేకమంది మీద బురద జల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి అని ఆరోపణ
  • ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో ములాకత్ కుదుర్చుకున్నారని విమర్శ
  • కడియం శ్రీహరి వల్లే రమేశ్ పార్టీ మారినట్లు చెప్పిన ఎర్రబెల్లి దయాకర రావు
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, కడియం శ్రీహరి లాంటి వ్యక్తుల వల్లే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లవలసి వచ్చిందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి వారు రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాకత్ కుదుర్చుకొని, వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమికి కారణమైన వ్యక్తి కడియం శ్రీహరి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం కోవర్టుగా పని చేశారని ఆరోపించారు. ఆయన చేసిన మోసం వల్ల ఫలితాలు బీఆర్ఎస్‌కు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని, అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో తాను బయటకు వెళ్లానని అన్నారు. ఇప్పుడు ఆ పాపాత్ముడు బయటకు పోయాడు కాబట్టి తిరిగి సొంత ఇంటికి వచ్చానని అన్నారు. చిన్నప్పుడు పిల్లవాడు తప్పిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తే ఎలా సంబరం ఉంటుందో ఇప్పుడు పార్టీలో, తనకు అంతటి సంతోషం ఉందని అన్నారు.

ఆరూరి రమేశ్ పోవడానికి కారణం అదే: ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడానికి కడియం శ్రీహరి కారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కడియం శ్రీహరి వంటి మోసపూరిత వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారనే ఆవేదనతోనే అతను పార్టీ నుంచి వెళ్లిపోయాడని అన్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై ఎప్పుడూ ఆయనకు కోపం లేదని అన్నారు. భవిష్యత్తులో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటామని అన్నారు.
Aroori Ramesh
BRS party
Kadiyam Srihari
Errabelli Dayakar Rao
Telangana politics
Warangal district

More Telugu News