Sabarimala Gold Case: శబరిమల బంగారం కేసులో కీలక మలుపు.. వీడిన చిక్కుముడి!

ISRO scientific tests confirm Sabarimala gold was stripped
  • శబరిమల బంగారం కేసులో కీలక శాస్త్రీయ ఆధారాలు
  • గర్భగుడి తలుపులను మార్చలేదని తేల్చిన వీఎస్‌ఎస్‌సీ
  • రాగి రేకులపై ఉన్న బంగారు పొరను రసాయనాలతో దోపిడీ
  • ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించిన దర్యాప్తు బృందం
  • త్వరలో తుది నివేదిక ఇస్తామని చెప్పిన శాస్త్రవేత్తలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల గర్భగుడి స్వర్ణ బంధనం (బంగారు తాపడం) చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. గర్భగుడి తలుపులను మార్చలేదని, వాటిపై ఉన్న రాగి రేకుల మీద నుంచి బంగారు పొరను మాత్రమే నేర్పుగా దోచుకున్నారని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ మేరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) శాస్త్రవేత్తలు సమర్పించిన నివేదికను, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బుధవారం కేరళ హైకోర్టుకు సమర్పించింది.

ప్రస్తుతం గర్భగుడికి ఉన్నవి అసలైన రాగి రేకులేనని, వాటిని మార్చలేదని వీఎస్‌ఎస్‌సీ శాస్త్రవేత్తలు తమ నివేదికలో స్పష్టం చేశారు. తలుపుల చెక్క ఫ్రేమ్‌వర్క్ (స్థానికంగా 'కట్టిల్' అంటారు) కూడా పాతదేనని నిర్ధారించారు. దొంగిలించబడింది ఘనమైన బంగారం కాదని, రాగి రేకులపై ఉన్న బంగారు పొర మాత్రమేనని తేల్చారు. కొన్ని రేకులపై బంగారం శాతం గణనీయంగా తగ్గడాన్ని బట్టి, రసాయనాలను ఉపయోగించి బంగారాన్ని వేరు చేసి ఉంటారని అంచనా వేశారు.

రేకులపై కనిపించిన మార్పుల వల్ల వాటిని పూర్తిగా మార్చేసి ఉంటారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే, బంగారం వెలికితీతకు ఉపయోగించే పాదరసం వంటి రసాయనాల ప్రయోగం వల్లే వాటి ఉపరితలంలో మార్పులు వచ్చాయని, భౌతికంగా వాటిని మార్చలేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ వాదనతో అంతర్జాతీయ ముఠాలకు విక్రయించి ఉంటారన్న ఊహాగానాలకు తెరపడినట్టయింది.

ఈ కేసుకు సంబంధించి మరిన్ని విశ్లేషణలు కొనసాగుతున్నాయని, పాత గర్భగుడి తలుపుల నమూనాలతో పోల్చి తుది నివేదికను త్వరలోనే సమర్పిస్తామని వీఎస్‌ఎస్‌సీ అధికారులు సిట్‌కు తెలిపారు. ఈ శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తునకు స్పష్టమైన దిశానిర్దేశం లభించింది. గర్భగుడి నిర్మాణాలను మార్చకుండా, కేవలం రసాయన ప్రక్రియ ద్వారా బంగారాన్ని ఎలా దొంగిలించారు, ఈ నేరం వెనుక ఉన్నదెవరు అనే కోణంలో ఇప్పుడు విచారణ జ‌ర‌గ‌నుంది.
Sabarimala Gold Case
Sabarimala
gold theft
Kerala High Court
VSSC
Vikram Sarabhai Space Center
SIT
special investigation team
gold layer
copper plates

More Telugu News