Chandrababu: రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Railway Projects Review by Chandrababu
  • పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీపై ప్రధానంగా చర్చ
  • రాయలసీమ నుంచి కోస్తాకు మెరుగైన రైలు మార్గాలపై దృష్టి
  • హై స్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటు ప్రతిపాదనపై సమావేశంలో సమీక్ష
  • విజయవాడ, విశాఖ వంటి జంక్షన్లలో రద్దీ తగ్గించడంపై చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని హింటర్ ల్యాండ్‌కు సరుకు రవాణాను పెంచేందుకు అవసరమైన రైలు అనుసంధానంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే, రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచే అంశాలపైనా సమీక్షించారు.

విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట వంటి ప్రధాన జంక్షన్లలో రైళ్ల రద్దీని తగ్గించే మార్గాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు వంటి కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యాన్ని విస్తరించడంపై ప్రత్యేకంగా చర్చించారు.

హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మార్గాలను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Chandrababu
Andhra Pradesh
Railway Projects
South Central Railway
East Coast Railway
Railway Connectivity
Visakhapatnam
Vijayawada
Rayalaseema
High Speed Rail Corridor

More Telugu News