Arava Sreedhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన చర్యలు.. విచారణకు కమిటీ

Janasena takes action on Railway Koduru MLA Arava Sreedhar Inquiry committee formed
  • రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణల దుమారం
  • ఆరోపణలపై విచారణకు జనసేన త్రిసభ్య కమిటీ ఏర్పాటు
  • విచారణ పూర్తయ్యేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీధర్‌కు ఆదేశం
  • వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచన
ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

ఈ మేరకు జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది" అని ప్రకటనలో పేర్కొంది. టి. శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్‌లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఆదేశించారు. ఆరోపణల్లోని నిజానిజాలను విచారించి, వారం రోజుల్లోగా పార్టీకి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని, అప్పటివరకు శ్రీధర్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని జనసేన స్పష్టం చేసింది.
Arava Sreedhar
Railway Koduru
Janasena
AP Politics
Tirupati District
Allegations
Investigation Committee
Andhra Pradesh

More Telugu News