Tamannaah: ఆ బంధం నాకు ప్రమాదకరంగా అనిపించింది.. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చేశా: తమన్నా

Tamannaah Bhatia opens up about dangerous relationship and heartbreak
  • తన ప్రేమ, బ్రేకప్‌లపై స్పందించిన తమన్నా
  • విజయ్ వర్మను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో చర్చ
  • ప్రేమ కంటే కెరీర్, ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి
  • ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ, బ్రేకప్‌లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమ, ఆ తర్వాత విడిపోయినట్లు వచ్చిన వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ, తన జీవితంలో ఎదురైన ఓ బంధాన్ని ప్రమాదకరంగా అభివర్ణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, తన జీవితంలో రెండుసార్లు తీవ్రంగా బాధపడ్డానని (హార్ట్ బ్రేక్) తెలిపారు. యుక్తవయసులో మొదటిసారి ప్రేమలో పడ్డానని, అయితే అప్పుడు కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బంధం నుంచి బయటకు వచ్చానని వివరించారు. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ, కొంతకాలానికే అతను తనకు సరైన జోడీ కాదని గ్రహించానని పేర్కొన్నారు. "అలాంటి బంధంలో కొనసాగడం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరం అనిపించింది. అందుకే ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికాను" అని తమన్నా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆమె ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది విజయ్ వర్మతో ఉన్న బంధం గురించేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ సమయంలో తమన్నా, విజయ్ వర్మల మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించడంతో వీరి పెళ్లి ఖాయమని ప్రచారం జరిగింది. అయితే, తమన్నా పెళ్లికి సిద్ధపడగా, విజయ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజా వ్యాఖ్యలతో ఆ పాత ప్రచారానికి మళ్లీ బలం చేకూరింది. ప్రేమ కంటే కెరీర్, ఆత్మగౌరవమే ముఖ్యమని తమన్నా చెప్పడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా తన సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. గతేడాది ‘ఓదెలా 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఇప్పుడు కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న ‘పురుషన్’ (తెలుగులో 'మొగుడు') చిత్రంలో న‌టిస్తున్నారు.
Tamannaah
Tamannaah Bhatia
Vijay Varma
heartbreak
relationship
love life
breakup
career
Purushan movie

More Telugu News