జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన నిందితుల అరెస్ట్

  • స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 2.58 కోట్లు కాజేసిన సైబర్ నేరస్థులు
  • ఈ నెల మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన జేడీ దంపతులు
  • బీహార్, పశ్చిమ బెంగాల్ కు చెందిన నలుగురు నిందితుల అరెస్ట్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి ఈ నెల 5 వరకు సాగిన ఈ మోసంలో జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుంచి నిందితులు రూ.2.58 కోట్లు కాజేశారు.

అసలేం జరిగిందంటే..
గత నవంబర్ నెలలో ఊర్మిళ వాట్సాప్ నెంబర్ కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సందేశం వచ్చింది. తాము సూచించే స్టాక్ లో పెట్టుబడి పెడితే 500 రెట్లు లాభాలు వస్తాయని దుండగులు తెలిపారు. ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో ఊర్మిళ ఆ మెసేజ్ లోని లింక్ ను తెరిచి దుండగులను సంప్రదించారు.

వారి సూచనలతో డిసెంబర్ 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడికి రూ.2 కోట్లు లాభం వచ్చినట్లు చూపించిన దుండగులు.. ఆ మొత్తాన్ని డ్రా చేసుకోవాలంటే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మెలిక పెట్టారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఊర్మిళ.. భర్త జేడీ లక్ష్మీనారాయణతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News