ట్రాక్టర్ బోల్తా .. తల్లీకుమార్తెల దుర్మరణం

  • మేడారం మహాజాతరకు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడిన వైనం
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కాటారం - మేడారం ప్రధాన రహదారిపై ఘటన 
  • తీవ్రంగా గాయపడిన మరో మహిళ
మేడారం మహాజాతరకు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో తల్లి, కుమార్తె అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కాటారం - మేడారం ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మి (45)  ఆమె కుమార్తె కస్తూరి అక్షిత (21)గా పోలీసులు గుర్తించారు. 

మహదేవపూర్‌ మండలం బొమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లో సుమారు 25 మంది భక్తులు మేడారం జాతరకు బయలుదేరగా, మహాముత్తారం మండలంలోని పెగడపల్లి - కేశవాపూర్‌ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్‌ను రహదారి కిందకు దించి తిరిగి ఎక్కించే సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ ట్రాలీ కింద తల్లి, కుమార్తె ఇద్దరూ నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ ట్రాలీ కింద ఇరుక్కుపోగా, పోలీసులు స్థానికుల సహాయంతో ఆమెను బయటకు తీసి భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న ఏఎస్పీ నరేశ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదం కారణంగా మేడారం వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


More Telugu News