Iran Currency: డాలర్‌కు 15 లక్షల రియాల్స్.. ఇరాన్ కరెన్సీ చారిత్రక పతనం

Iran Currency Plummets to Historic Low of 15 Lakh Rials per Dollar
  • ఇరాన్ కరెన్సీ రియాల్ రికార్డు కనిష్ఠ స్థాయికి పతనం
  • అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 15 లక్షల రియాల్స్‌కు పడిపోయిన విలువ
  • దేశవ్యాప్త ఆందోళనలు, ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణం
  • నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదం.. వేలల్లో మరణాలని సామాజిక కార్యకర్తల ఆరోపణ
  • రెండు వారాలకు పైగా దేశంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ నిన్న‌ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఒక డాలర్‌కు 15 లక్షల రియాల్స్ చొప్పున స్థానిక ఎక్స్ఛేంజ్ కేంద్రాలు ధరను నిర్ణయించాయి.

అంతర్జాతీయ ఆంక్షలు, ముఖ్యంగా దేశ అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలు, ప్రభుత్వ అధికారుల అసమర్థ నిర్వహణ వంటి కారణాలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే కరెన్సీ విలువ పడిపోవడంతో గతేడాది డిసెంబర్ 28న ప్రజలు నిరసనలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించి తీవ్ర రూపం దాల్చాయి.

ప్రజల నిరసనలను అక్కడి మత పెద్దల ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు వారాలకు పైగా ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిర‌స‌న‌లను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అనుస‌రిస్తున్న‌ కఠిన చ‌ర్య‌ల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు కనీసం 6,126 మంది మృతిచెందారని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో వాస్తవ పరిస్థితులు, మరణాల సంఖ్యపై పూర్తి స్పష్టత రావడం లేదు.
Iran Currency
Iran Rial
Iranian economy
Iran protests
Iran economic crisis
US dollar
Iran nuclear program
currency devaluation
Tehran
economic sanctions

More Telugu News