ఇక సినిమా పాటలు పాడను: అర్జిత్ సింగ్

  • ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ 
  • సోషల్ మీడియా వేదికగా వెల్లడి 
  • తన సంగీత ప్రయాణం ఇప్పటి వరకు అద్భుతంగా సాగిందన్న అర్జిత్‌ సింగ్‌
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, కోట్లాది మంది సంగీత ప్రియుల ఆరాధ్య దైవం అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త పాటలు పాడబోనని ఆయన ప్రకటించారు. తన 15 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్య ప్రకటనతో ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, సంగీతాన్ని మాత్రం తాను వీడటం లేదని, స్వతంత్ర కళాకారుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

"అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త అవకాశాలు స్వీకరించబోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నా ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం" అని అర్జిత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో, "సంగీతాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. దేవుడు నా పట్ల దయగా ఉన్నాడు. ఒక చిన్న కళాకారుడిగా భవిష్యత్తులో మరింత నేర్చుకుంటాను, స్వతంత్రంగా సంగీతాన్ని సృష్టిస్తాను. ఇప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేస్తాను. కాబట్టి ఈ ఏడాది నా పాటలు కొన్ని విడుదల కావచ్చు" అని ఆయన వివరణ ఇచ్చారు.

ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను తన ప్రైవేట్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. "ఈ నిర్ణయానికి ఒక్క కారణం కాదు, చాలా అంశాలు ఉన్నాయి. చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను. నిజం చెప్పాలంటే, నాకు విసుగు వచ్చింది. ఎదుగుదలకు కొత్త రకం సంగీతాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది. నాకు త్వరగా ఆసక్తి పోతుంది, అందుకే నా పాటల అరేంజ్‌మెంట్లను మార్చి లైవ్‌లో ప్రదర్శిస్తుంటాను" అని అర్జిత్ పేర్కొన్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతంపై దృష్టి పెట్టాలని, స్ఫూర్తినిచ్చే కొత్త గాయకులను వినాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 38 ఏళ్ల అర్జిత్ సింగ్, 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' సినిమాలోని 'మాతృభూమి' పాట విడుదలైన కొద్దికాలానికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.

టాలీవుడ్‌లోనూ అర్జిత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 'మనం' మూవీలోని 'కనులను తాకే ఓ కల', 'స్వామి రారా' మూవీలోని 'అదేంటి ఒక్కసారి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లోని 'మాయ' వంటి పాటలు శ్రోతల హృదయాలను దోచుకున్నాయి. తెలుగుతో పాటు బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీ భాషల్లోనూ ఆయన పాటలు విశేషంగా ఆదరణ పొందాయి. సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గానూ గతేడాది కేంద్ర ప్రభుత్వం అర్జిత్ సింగ్‌కు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. 'మర్డర్ 2' (2011) చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అర్జిత్, 'ఆషికి 2' (2013)లోని 'తుమ్ హి హో' పాటతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.


More Telugu News