సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన కేసులో నలుగురి అరెస్ట్

  • మయన్మార్ ముఠాకు మ్యూల్ ఖాతాలు అందించిన నిందితులు
  • బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నిందితులను పట్టుకున్న పోలీసులు
  • మోసపోయిన సొమ్ములో రూ.45 లక్షలను ఫ్రీజ్ చేసిన అధికారులు
  • రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను మోసగించిన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్‌ చేశారు. మోసానికి గురైన సొమ్ములో రూ.45 లక్షలను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

మయన్మార్‌ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాకు ఈ నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ నలుగురు సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలను సమకూర్చినట్లు నిర్ధారించారు. నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

గతేడాది నవంబరులో ఊర్మిళ వాట్సప్‌కు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి ఓ లింక్ వచ్చింది. 500 రెట్ల లాభం వస్తుందని ఆశచూపడంతో ఆమె పలు దఫాలుగా డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య రూ.2.58 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఆమె ఖాతాలో రూ.2 కోట్ల లాభం వచ్చినట్లు నమ్మించి, ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించలేదు. పైగా మరింత డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఊర్మిళ ఈ నెల మొదటి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


More Telugu News