Singareni Workers: కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సింగరేణిపై తెలంగాణ‌ ప్రభుత్వం వ‌రాల జ‌ల్లు

Mallu Bhatti Vikramarka Announces Welfare Measures for Singareni Workers
  • సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల భారీ ప్రమాద బీమా
  • 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ. 40 లక్షల బీమా సౌకర్యం
  • కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు
  • దశాబ్దాల ‘మారుపేరు’ సమస్యకు త్వరలోనే పరిష్కారం
  • ఆదాయపు పన్ను రాయితీలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా పలు కీల‌క‌ నిర్ణయాలు తీసుకుంది. కార్మికుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు కార్మికులకు భరోసా కల్పించే అనేక కీలక పథకాలను ఆయన ప్రకటించారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింగరేణి ప‌ర్మినెంట్‌ ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల భారీ ప్రమాద బీమాను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని భట్టి తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు సైతం రూ. 40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ కారుణ్య నియామకాల కింద వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో వయసు మీరి ఉద్యోగావకాశాలు కోల్పోతున్న ఎందరో వారసులకు లబ్ధి చేకూరనుంది.

దశాబ్దాలుగా కార్మికులను వేధిస్తున్న ‘మారుపేరు’ సమస్యను త్వరలోనే పరిష్కరించి, రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందేలా చూస్తామని భట్టి హామీ ఇచ్చారు. మెడికల్ ఇన్వాలిడేషన్ అడ్డంకులు తొలగించి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.

సింగరేణి ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి, క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారుల తరహాలోనే సాధారణ కార్మికులకు కూడా ఆదాయపు పన్ను రాయితీలు కల్పించే అంశంపై అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, కార్మికుల హక్కులను కాపాడుతూ వారి సంక్షేమానికి పెద్దపీట వేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Singareni Workers
Mallu Bhatti Vikramarka
Singareni Collieries
Telangana government
coal mine workers
workers welfare
accident insurance
karunya appointments
medical invalidation
house construction scheme
income tax exemption

More Telugu News