Rahul Gandhi: సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం: రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టడంపై జగ్గారెడ్డి

Rahul Gandhi Jaggareddy criticizes seating arrangement at Republic Day event
  • గణతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టారని ఆవేదన
  • ఐదో వరుసలో కూర్చోబెట్టినా ఆయన బాధపడరన్న జగ్గారెడ్డి
  • రాహుల్ గాంధీ ఆలోచన, మాట తీరు, ప్రవర్తన సింహంలా ఉంటుందన్న జగ్గారెడ్డి
గణతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజకీయ సంప్రదాయం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని ఆయన కోరారు.

స్వాతంత్రానంతరం నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆనవాయతీని కొనసాగించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తే ప్రతిపక్ష నాయకుడిని మొదటి వరుసలో కూర్చోబెట్టేవారని, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన హక్కు అని ఆయన అన్నారు.

ప్రస్తుత గణతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రవర్తనను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. మోదీ ప్రభుత్వం సంప్రదాయాలను పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ మూడో వరుసలో కూర్చున్నందుకు బాధపడరని, ఎందుకంటే ప్రధాని పదవి ఆయన ఇంట్లో పుట్టిందని అన్నారు. నరేంద్ర మోదీ ఇంట్లో ప్రధానమంత్రి పదవి పుట్టలేదని ఆయన ఎద్దేవా చేశారు.

న్యాయమైన పాలన, పేదలకు అండగా ఉండే పాలనను రాహుల్ గాంధీ కుటుంబమే అందించిందని జగ్గారెడ్డి అన్నారు. కాబట్టి ఆయనను మూడో వరుసలో కాదు, ఐదవ వరుసలో కూర్చోబెట్టిన బాధపడరని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశాన్ని 47 సంవత్సరాలు పాలించిందని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇప్పుడు మాత్రం పద్ధతి లేని పాలన కనిపిస్తోందని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ ఆలోచన, మాట తీరు, ప్రవర్తన అన్నీ సింహంలా ఉంటాయని ఆయన అన్నారు.

సింహానికి సింహాసనం అవసరం లేదని, సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుందని ఆయన అన్నారు. మోదీ సింహాసనం మీద కూర్చుంటేనే ప్రధాని అవుతారని ఆయన విమర్శించారు. ప్రియాంక గాంధీ పార్లమెంటులో మోదీని పులిలా వేటాడుతోందని అన్నారు. మంచి పాలన ఇవ్వమని బీజేపీకి ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టమని కాదని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ కుటుంబంపై రాజకీయ కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. వాజపేయి లాంటి వారు పార్లమెంటులో ఉండాలని, ప్రతిపక్షంలో ఆయనలాంటి వారు ఉంటేనే అన్ని అంశాలు చర్చకు వస్తాయని ఇందిరా గాంధీ గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. వాజపేయి, అద్వానీ లాంటి వారిని మొదటి వరుసలో కూర్చోబెట్టి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గౌరవించారని అన్నారు. ఇప్పుడు సంప్రదాయాలను ఎందుకు పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడున్న జనరేషన్‌కు మీరు ఏం చెప్పదలుచుకున్నారని ఆయన నిలదీశారు. బీజేపీ వారు ధర్మం అంటారని, కానీ పాటించరని, దేవుడు అంటారు కానీ పద్ధతులు పాటించరని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రులు వస్తారు.. పోతారు, కానీ చరిత్రను రాయలేరని అన్నారు. ఒక నిజాంను వదిలేసి మిగిలిన నిజాం నవాబులను ప్రజలు గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. బీజేపీ ఎంతసేపూ ప్రజల్లోకి చెడను ఎలా చొప్పించాలనే చూస్తోందని ఆరోపించారు. ప్రజలను ట్రాప్ చేయడం ఎలా అనేది బీజేపీ పాలసీ అని, అంతకుమించి ఏమీ లేదని ఆయన విమర్శించారు.
Rahul Gandhi
Jaggareddy
Republic Day
Congress
BJP
Political protocol
Parliament
Sonia Gandhi

More Telugu News