K Kavitha: కేసీఆర్ ఏం తింటున్నాడో రేవంత్ రెడ్డికి చెప్పేది అతడే... మొదటి రాక్షసుడు!: కవిత

Kavitha Alleges Santosh Rao is Informing Revanth Reddy
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు ప్రధాన ఇన్ఫార్మర్ అని కవిత ఆరోపణ
  • కేసీఆర్ ఏం తిన్నారో కూడా చేరవేసే వ్యక్తి సంతోష్ అని తీవ్ర వ్యాఖ్య
  • తాను చెప్పిన రాక్షసుల్లో మొదటి వ్యక్తి సంతోష్ రావేనని స్పష్టీకరణ
  • గద్దర్, ఈటల వంటి వారిని కేసీఆర్‌కు దూరం చేసింది సంతోషేనని విమర్శ
  • గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సమీప బంధువు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు ఒక 'ప్రధాన ఇన్ఫార్మర్' అని, 'రహస్య గూఢచారి'గా పనిచేస్తున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంతోష్ రావును కాపాడే ప్రయత్నం చేస్తుండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

మంగళవారం నాడు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సంతోష్ రావు.. రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారని కవిత ఆరోపించారు. "కేసీఆర్ ఏం తింటున్నారు... ఇడ్లీ తిన్నారా లేదా అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డికి చేరవేసే వ్యక్తి సంతోష్" అని ఆమె ఘాటుగా విమర్శించారు. 

తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌కు దూరం చేయడంలో సంతోష్ రావు కీలకపాత్ర పోషించారని ఆమె అన్నారు. విప్లవ గాయకుడు గద్దర్‌ను ప్రగతి భవన్ బయట నిరీక్షించేలా చేసిన ఘటనకు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌ను వీడటానికి కూడా సంతోష్ రావే కారణమని ఆమె ఆరోపించారు. గతంలో తాను చెప్పిన రాక్షసుల్లో మొదటి వ్యక్తి సంతోష్ రావేనని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక దేవుడని, ఆయన చుట్టూ రాక్షసులు ఉన్నారని గత ఏడాది ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కవిత, ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను స్థాపించిన తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను నిమ్స్‌లో పరామర్శించిన అనంతరం కవిత మాట్లాడారు. "ఒక గంజాయి బ్యాచ్‌కు ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను చంపడానికి ప్రయత్నించేంత ధైర్యం ఉందంటే, వారికి ప్రభుత్వంపై ఏమాత్రం భయం లేదని స్పష్టమవుతోంది" అని ఆమె అన్నారు. 

రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి రహితంగా మారుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పుడు గ్రామాల్లో, పాఠశాలల్లో కూడా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి కారణంగా గృహహింస ఘటనలు కూడా పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి తుపాకీ ఫైరింగ్‌తో సహా శిక్షణ ఇస్తున్నప్పటికీ, ఆయుధాలు అందించడం లేదని, వారి వద్ద ఆయుధాలు ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు కనీసం భయమైనా ఉంటుందని కవిత అభిప్రాయపడ్డారు.
K Kavitha
Kalvakuntla Kavitha
Joginapalli Santosh Rao
BRS
Revanth Reddy
Telangana
Telangana Jagruthi
KCR
Phone Tapping Case
Drugs

More Telugu News