Chandrababu Naidu: పనితీరు బాగోకపోతే పదవులు ఊడతాయి: నేతలకు చంద్రబాబు వార్నింగ్

Chandrababu Naidu Warns Inactive Leaders Will Lose Posts
  • పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదన్న చంద్రబాబు
  • పదవులు పొందిన నేతల పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష
  • జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం
  • అధికారాన్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత అని నేతలకు సూచన
  • గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తీవ్ర విమర్శలు
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదని, ఏ నాయకుడైనా సరే నిర్లక్ష్యం వహించినా, వివాదాలు సృష్టించినా పక్కనబెట్టడానికి వెనుకాడబోనని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న భావనతో ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

"పార్టీలో పదవులు పొందిన వారి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తాను. సరిగా పనిచేయకపోతే వారిని తప్పించి, మరొకరికి అవకాశం కల్పిస్తాను. పార్టీలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తల్లో కూడా మార్పు రావాలి. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని చంద్రబాబు స్పష్టం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో పార్లమెంట్ కమిటీలు కీలకమని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా పార్లమెంట్ అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసికట్టుగా పనిచేయాలని, 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే మరో పది ఓట్లు అదనంగా వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. "ప్రజల భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై కూడా వాళ్ల ఫొటోలు ముద్రించుకున్నారు. చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ప్రజల ఆస్తుల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. అందుకే ఆ లోపభూయిష్టమైన చట్టాన్ని రద్దు చేశాం. ఏడాదిలోగా మళ్లీ సర్వేలు చేసి, ఎలాంటి సమస్యలు లేని పట్టాదారు పుస్తకాలు అందిస్తాం" అని హామీ ఇచ్చారు.

అమరావతి విషయంలో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని, ఇప్పుడు మళ్లీ తాము రాజధానికి జీవం పోశామని అన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేస్తూనే, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. భోగాపురం విమానాశ్రయంలో 500 ఎకరాలు కొట్టేయాలని చూశారని, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు.

కార్యకర్తే అధినేత.. వారికి అండగా ఉండాలి

పార్టీలో కార్యకర్తే అధినేత అని, వారికి న్యాయం జరిగినప్పుడే పార్టీ శాశ్వతంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, పసుపు జెండా కోసం రక్తం చిందించారని గుర్తుచేశారు. "ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. నాయకులెవరూ కేడర్‌ను విస్మరించవద్దు. వారితో నిరంతరం అనుసంధానమై ఉండాలి" అని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. "మనం చేసే పనులు ఎంత ముఖ్యమో, మనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలోనే కాదు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ప్రజలకు వాస్తవాలు వివరించాలి," అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్‌ చేశామని, డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాల భర్తీతో పాటు రోడ్ల మరమ్మతులు వేగవంతం చేశామని వివరించారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కూటమి గెలిచేలా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు.


Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh
AP Politics
YCP Government
Amaravati
Janasena
BJP
Political Governance

More Telugu News