తప్పతాగి కారు నడిపి మూడు కార్లను ఢీకొట్టాడు... భారత మాజీ క్రికెటర్ అరెస్ట్

  • ఫుల్లుగా తాగి కారు డ్రైవింగ్ చేసిన జాకబ్ మార్టిన్
  • వడోదరలో ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టిన వైనం
  • జాకబ్ మార్టిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మార్టిన్
భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదరలో మద్యం మత్తులో కారు నడుపుతూ, రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టిన ఘటనలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అకోటా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మార్టిన్ తన ఎంజీ హెక్టర్ కారులో ఇంటికి వెళుతుండగా, పునిత్ నగర్ సొసైటీ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన కియా సెల్టోస్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సెలెరియో కార్లను ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నాడు. అతడు మద్యం సేవించినట్లు స్పష్టంగా కనిపించిందని, సరిగా నిలబడలేకపోయాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీంతో నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో పాటు, గుజరాత్ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 66(1)(B) కింద కూడా కేసులు నమోదు చేశారు. సుమారు రూ. 20 లక్షల విలువైన అతడి కారును స్వాధీనం చేసుకున్నారు.

భారత్ తరఫున 10 వన్డే మ్యాచ్‌లు ఆడిన జాకబ్ మార్టిన్, దేశవాళీ క్రికెట్‌లో వడోదర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడిపై గతంలోనూ వడోదరలో మద్యం నిషేధ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


More Telugu News