Dharmendra: కొబ్బరినీళ్లలో వోడ్కా.. 50 కి.మీ నడక.. ధర్మేంద్ర సంగతులు చెప్పిన రమేశ్ సిప్పీ!

Dharmendra Sholay secrets revealed by Ramesh Sippy
  • షోలే 50 ఏళ్ల వేడుకలో పాత జ్ఞాపకాలు పంచుకున్న హేమమాలిని, రమేశ్ సిప్పీ
  • హోటల్ నుంచి షూటింగ్ స్పాట్‌కు 50 కిలోమీటర్లు నడిచిన ధర్మేంద్ర
  • కొన్నిసార్లు కొబ్బరినీళ్లలో వోడ్కా కలిపి తాగేవారని వెల్లడి
  • ధర్మేంద్రలో చిన్నపిల్లాడి అమాయకత్వం, పౌరుషం రెండూ ఉండేవన్న రమేశ్ సిప్పీ
భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన ‘షోలే’ చిత్రానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ, ధర్మేంద్ర భార్య, నటి హేమమాలిని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా హీరో ధర్మేంద్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ లాంచ్ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.

షూటింగ్ సమయంలో ధర్మేంద్ర డెడికేషన్ గురించి రమేశ్ సిప్పీ వివరిస్తూ, "ఒకరోజు ధర్మేంద్ర హోటల్ నుంచి షూటింగ్ ప్రదేశానికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది దాదాపు 50 కిలోమీటర్ల దూరం. తెల్లవారుజామున 2 లేదా 3 గంటలకు నడక మొదలుపెట్టి, ఉదయం 7 గంటలకు లొకేషన్‌కు చేరుకున్నారు. గంట సేపు విశ్రాంతి తీసుకుని, వెంటనే షూటింగ్‌కు సిద్ధమయ్యారు. అది నమ్మశక్యంగా లేదు, కానీ ఆయన పట్టుదల అలాంటిది" అని చెప్పారు. దీనికి హేమమాలిని కూడా స్పందిస్తూ, "ఆయన మైళ్ల దూరం నడిచేవారు" అని అన్నారు.

అదే సమయంలో ధర్మేంద్ర సరదా కోణాన్ని కూడా సిప్పీ గుర్తుచేసుకున్నారు. "కొన్నిసార్లు కొబ్బరినీళ్లలో కొద్దిగా వోడ్కా కలిసేది. ఓ చిన్న కన్నుగీటుతో ఆ విషయం మాకు అర్థమయ్యేది. అది ఆయనకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చేది" అని తెలిపారు. "ధర్మేంద్రలో ఒక చిన్నపిల్లాడి లాంటి అమాయకత్వం, అదే సమయంలో దృఢమైన వ్యక్తిత్వం రెండూ ఉండేవి. కోపం వచ్చినా క్షణాల్లోనే మళ్లీ మామూలు మనిషి అయిపోయేవారు. ఆయనలోని ఈ లక్షణమే అందరినీ ఆకట్టుకునేది" అని రమేష్ సిప్పీ వివరించారు.

కాగా, 1975లో విడుదలైన ‘షోలే’ చిత్రంలో ధర్మేంద్ర ‘వీరు’ పాత్రలో నటించారు. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, హేమమాలిని, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించారు.


Dharmendra
Sholay
Ramesh Sippy
Hema Malini
Bollywood
Indian Cinema
Shooting secrets
vodka
50 km walk

More Telugu News