Somireddy Chandramohan Reddy: కేంద్రానికి ధర్మాన లేఖ రాయడం సిగ్గుచేటు: సోమిరెడ్డి

Somireddy Slams Dharmana for Letter to Center on Land Act
  • వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ దుర్మార్గమైన చట్టమని సోమిరెడ్డి విమర్శ
  • ఈ చట్టాన్ని సమర్థిస్తూ కేంద్రానికి లేఖ రాయడంపై ధర్మానపై ఫైర్
  • రీ-సర్వే పేరుతో రూ.700 కోట్లు జగన్ బొమ్మల కోసం ఖర్చు చేశారని ఆరోపణ
  • సర్వేపల్లి నియోజకవర్గంలో వేలాది ఎకరాలను వివాదాల్లోకి నెట్టారని ధ్వజం
  • కూటమి ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తుందని హామీ
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అత్యంత దుర్మార్గమైన చట్టమని, దీని ద్వారా జగన్ ప్రభుత్వం సామాన్యుల ఆస్తి హక్కులను బలిపీఠం ఎక్కించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసిందని, దీనిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటని విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీతి ఆయోగ్ సూచనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరించేలా చట్టంలో మార్పులు చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. కేంద్రం 'ప్రభుత్వ అధికారులను' నియమించమంటే, వైసీపీ 'ఏ వ్యక్తినైనా' (Any Person) అనే పదం చేర్చి తమకు అనుకూలమైన రిటైర్డ్ అధికారులను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టిందని విమర్శించారు.

భూ వివాదాల పరిష్కారానికి దశాబ్దాలుగా ఉన్న సివిల్ కోర్టుల అధికారాన్ని ఈ చట్టం తొలగించి, సర్వాధికారాలను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) చేతిలో పెట్టిందని మండిపడ్డారు. దీనివల్ల ఓ సామాన్య రైతు తన భూమి కోసం నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని, ఇది పేదలకు ఉరితాడు వేయడమేనని అన్నారు. యజమాని దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లకు విలువ లేకుండా చేసి, ఆన్‌లైన్ రికార్డులే ప్రామాణికమనడం వెనుక భూములను కబళించే భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

రీ-సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను 22A జాబితాలో చేర్చారని సోమిరెడ్డి పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో అప్పటి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అనుచరులు వేల ఎకరాలను వివాదాల్లోకి నెట్టారని, ఈ అక్రమాల వల్లే నలుగురు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారని గుర్తుచేశారు. 

పొదలకూరు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో 566 ఎకరాలు, పర్లపల్లిలో 445 మంది రైతులకు చెందిన 254 ఎకరాలను అన్యాయంగా వివాదాస్పదం చేశారని గణాంకాలతో సహా వివరించారు. "మా తాతలు సంపాదించిన ఆస్తులపై జగన్ ఫోటో ఏంటి? ఇది నియంతృత్వ ధోరణి కాదా?" అని ఆయన ప్రశ్నించారు. రీ-సర్వే పేరుతో రూ.700 కోట్లను కేవలం పాస్‌బుక్‌లు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మల కోసం దుర్వినియోగం చేశారని విమర్శించారు.

రైతు కుటుంబం నుంచి వచ్చిన ధర్మాన ప్రసాదరావు, బ్రిటిష్ చట్టాల కన్నా దారుణంగా ఉన్న ఈ చట్టాన్ని ఎలా సమర్థిస్తారని సోమిరెడ్డి నిలదీశారు. ధర్మాన లేఖపై కేంద్రం లోతుగా విచారణ జరిపితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాల పాపాలు బయటపడతాయని హెచ్చరించారు. భూ యజమానుల ఒరిజినల్ పత్రాలను ఏదో ప్రైవేట్ కంపెనీ ద్వారా అమెరికా సర్వర్లలో దాచాలనే ఆలోచన ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు, భూ కబ్జాల వల్లే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. 

కూటమి ప్రభుత్వం ఇప్పటికే పొదలకూరు మండలంలోని అక్రమాలపై జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ జరిపిస్తోందని, బాధితులకు న్యాయం చేసి వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
Somireddy Chandramohan Reddy
Land Titling Act
Dharmana Prasada Rao
YCP government
Andhra Pradesh land scam
সার্ভেపल्ली
Kakani Govardhan Reddy
TDP
AP politics
Land disputes

More Telugu News