France Hindu Temple: ఫ్రాన్స్ లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన
- పారిస్ సమీపంలో హిందూ దేవాలయం నిర్మాణం
- ఇండియా నుంచి వచ్చిన తొలి రాళ్లకు ఘన స్వాగతం
- మన భారతీయ వాస్తుశిల్ప సంప్రదాయాలు, ఫ్రెంచ్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఆలయ నిర్మాణం
భారత్ – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా మరో అడుగు పడింది. పారిస్ సమీపంలోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో నిర్మాణమవుతున్న మొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన తొలి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది.
శతాబ్దాల నాటి హస్తకళా వారసత్వాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణం కోసం భారతీయ కళాకారులు స్థానిక ఫ్రెంచ్ రాతి పనివారితో కలిసి పనిచేస్తారు. వీరిలో నోట్రే-డామ్ కేథడ్రల్ పునరుద్ధరణలో పాల్గొన్న నిపుణుల బృందం కూడా ఉంది. భారతీయ వాస్తుశిల్ప సంప్రదాయాలను ఫ్రెంచ్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఏకం చేసి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, "భారతదేశం నుంచి మొదటి రాళ్ల రాక ఒక చారిత్రాత్మక మైలురాయి. ప్రతి రాయి వారసత్వం, శ్రద్ధ, ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. ఇది భాగస్వామ్య గౌరవం, సహకారం ద్వారా భారతీయ సంప్రదాయం, ఫ్రెంచ్ ఇంజినీరింగ్ యొక్క ఐక్యతను సూచిస్తుంది" అని తెలిపారు.