Samantha: రాష్ట్రపతి విందుకు సమంత... కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ పోస్ట్

Samantha Attends Presidents Republic Day Reception Expresses Gratitude
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన గణతంత్ర దినోత్సవ విందులో పాల్గొన్న సమంత
  • ఇలాంటి గౌరవం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదంటూ భావోద్వేగ పోస్ట్
  • ఈ స్థాయికి చేరడానికి తన మాతృభూమి ఇచ్చిన అవకాశమే కారణమని వ్యాఖ్య
  • లేత పచ్చరంగు చీరలో సంప్రదాయబద్ధంగా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి
  • ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమా నిర్మాణంలో, నటనలో సమంత బిజీ
ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన కెరీర్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు ఇన్‍స్టాగ్రామ్‌లో ఆమె స్పందిస్తూ, "నా ఎదుగుదలలో నన్ను ప్రోత్సహించేవారు లేరు. ఎప్పటికైనా ఇలాంటి వేదికపై నిలుచుంటానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు. ఎలాంటి మార్గం కనిపించలేదు. ఇలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు. కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది. దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని రాసుకొచ్చారు.

ఈ కార్యక్రమానికి సమంత లేత పచ్చరంగు చీరలో బంగారు అంచులతో ఎంతో సంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. బంగారు చోకర్ నెక్లెస్, చెవిపోగులతో తేలికపాటి మేకప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లో దిగిన పలు ఫొటోలను, విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా ఆమె షేర్ చేశారు. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక సమంత కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’పై సమంత నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
Samantha
Samantha Ruth Prabhu
President of India
Droupadi Murmu
Republic Day
At Home reception
Ma Inti Bangaram
BV Nandini Reddy
Tollywood
actress

More Telugu News