Chandrababu Naidu: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం... పడగొట్టినవి నిలబెడదాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Completing Pending Irrigation Projects in Andhra Pradesh
  • పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • రాయలసీమ, ప్రకాశం జిల్లాల సమగ్రాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి
  • 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులే లక్ష్యంగా కార్యాచరణ
  • ప్రాధాన్యత క్రమంలో 20కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశం
  • గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రణాళికలు
రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 10 జిల్లాలను ఉద్యాన కేంద్రాలుగా మార్చే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

20 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు 

గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అనేక ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టిందని ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 

ఈ ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గాలేరు-నగరి ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలన్నారు. 

మొత్తంగా 20కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు, మరో 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీరందించవచ్చని అధికారులు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ప్రాజెక్టులు చేపట్టాలని, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లి, పోలవరం-వంశధార నదుల అనుసంధానం చేపట్టవచ్చని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రపంచస్థాయి ఉద్యాన హబ్‌గా రాయలసీమ 

ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు. 

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్లలో ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. దుబాయ్‌కి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం వెల్లడించారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన గ్రామీణ రహదారుల నెట్‌వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్, గ్లోబల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ఈ బృహత్తర ప్రణాళికల అమలుకు పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్ట్ కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్ చైన్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

10 జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు:

• వెలిగొండ ప్రాజెక్ట్
• కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
• పాలేరు రిజర్వాయర్
• మల్లెమడుగు లిఫ్ట్-రిజర్వాయర్
• శ్రీ బాలాజీ రిజర్వాయర్
• కుప్పం బ్రాంచ్ కెనాల్
• పుంగనూరు బ్రాంచ్ కెనాల్
• మూలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
• హంద్రీ-నీవా ప్రధాన కాల్వ పనులు
• అట్లూరుపాడు-మేర్లపాక ఎస్ఎస్ఎల్సీ
• నీవా బ్రాంచ్ కెనాల్ పనులు
• జీడిపల్లి-భైరవానితిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకం
• జీడిపల్లి-అప్పర్ పెన్నార్ ఎత్తిపోతలు
• అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్
• మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులు
• పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
• కడప, కోడూరు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి
• అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్దరణ పనులు
• పశ్చిమ కర్నూలుకు నీళ్లిచ్చేలా వేదవతి-అలగనూరు-గాజులదిన్నె ప్రాజెక్టులు
• ఏడు జిల్లాల్లో 1,011 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి
Chandrababu Naidu
Andhra Pradesh
Irrigation Projects
Rayalaseema
Horticulture Hub
Polavaram Project
Annamayya Project
Uttarandhra
Veligonda Project
DP World

More Telugu News