Tamannaah: టీనేజ్‌లో లవ్, ఆ తర్వాత ఒక వ్యక్తితో రిలేషన్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

Tamannaah Bhatia Opens Up About Love and Relationships
  • ప్రేమలు, బ్రేకప్స్ గురించి ఎమోషనల్‌గా స్పందించిన తమన్నా
  • టీనేజ్‌లో తొలిసారి ప్రేమలో పడ్డానన్న మిల్కీ బ్యూటీ
  • విజయ్ వర్మతో రిలేషన్ గురించి పరోక్ష వ్యాఖ్యలు

మిల్కీ బ్యూటీ తమన్నా గత రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఐటెం సాంగులతో కూడా దూసుకుపోతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో సాగిన ప్రేమాయణం, ఆ తర్వాత జరిగిన బ్రేకప్ అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రేమలు, బ్రేకప్స్ గురించి ఎమోషనల్‌గా స్పందించింది.


ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, "నేను టీనేజ్‌లో ఉన్నప్పుడే మొదటిసారి ప్రేమలో పడ్డాను. కానీ నా లక్ష్యాలు, కెరీర్ కోసం ఆ బంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాను. కానీ కొన్నాళ్లకే ఆ వ్యక్తి నాకు సరైన జోడీ కాదనిపించింది. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరమని గ్రహించి బయటపడ్డాను" అని తెలిపింది. ఆమె ఈ వ్యాఖ్యలు విన్నవారంతా "ఆ డేంజర్ పర్సన్ ఎవరు? విజయ్ వర్మనేనా?" అని ఆరా తీస్తున్నారు.


తమన్నా-విజయ్ వర్మ ప్రేమాయణం 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ సెట్స్‌లో మొదలైంది. లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో వారు రెచ్చిపోవడంతో బీటౌన్ మీడియా రచ్చ చేసింది. ఆ తర్వాత ఏ ఈవెంట్‌కు వెళ్లినా కలిసే కనిపించడం, కలిసి ఫొటో షూట్లు చేయడం చూసి అందరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ ఆకస్మికంగా వీరిద్దరూ విడిపోయారు. తమన్నా పెళ్లికి సిద్ధమవుతుంటే, విజయ్ మాత్రం కెరీర్‌కే ప్రాధాన్యత ఇచ్చాడని బీటౌన్ టాక్. ఈ మధ్యలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అంటున్నారు.


తమన్నా ఇప్పుడు "ప్రేమ కంటే ఆత్మగౌరవం, కెరీర్ ముఖ్యం" అని స్పష్టంగా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో "తమన్నా బోల్డ్ డెసిషన్", "ఆమె లాంటి హీరోయిన్లు ఉంటేనే స్ఫూర్తి", "డేంజర్ అని చెప్పిన వ్యక్తి ఎవరో బయటపడాలి" అంటూ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు "విజయ్ వర్మతోనే బ్రేకప్ అని స్పష్టంగా చెప్పేసింది" అని కామెంట్ చేస్తున్నారు.

Tamannaah
Tamannaah Bhatia
Vijay Varma
love life
relationships
breakup
teenage love
career
Bollywood
affairs

More Telugu News