Akira Nandan: పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

Akira Nandan Gets Relief in Delhi High Court on Deepfake Movie
  • పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌పై డీప్‌ఫేక్ సినిమా
  • వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా
  • 'AI లవ్ స్టోరీ' సినిమా ప్రసారంపై స్టే విధించిన న్యాయస్థానం
  • సోషల్ మీడియా నుంచి వీడియోలు తొలగించాలని ఆదేశాలు
  • నిందితుల వివరాలు ఇవ్వాలని యూట్యూబ్, ఫేస్‌బుక్‌లకు సూచన
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన డీప్‌ఫేక్ సినిమాపై అకీరా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ సినిమాను వెంటనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

తన పేరు, ఫొటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని వాడుకుని 'AI లవ్ స్టోరీ' పేరుతో ఓ పూర్తిస్థాయి సినిమాను రూపొందించారని, దానిని యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో విడుదల చేశారని అకీరా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ డీప్‌ఫేక్ సినిమా వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అతడు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇది తన వ్యక్తిత్వ, గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని వాదించాడు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు... అకీరా నందన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అతడి అనుమతి లేకుండా ఎలాంటి డీప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం, పంచుకోవడం చేయరాదని సంభవామి స్టూడియోస్‌తో పాటు ఇతరులను ఆదేశించారు. వివాదాస్పద సినిమా లింకులను, నకిలీ ఖాతాలను తక్షణమే తొలగించాలని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌ సంస్థలకు స్పష్టం చేశారు. ఈ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన వారి ఐపీ అడ్రస్‌లు, ఇతర వివరాలను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. 

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు, ఇతర రంగాల సెలెబ్రిటీలో వ్యక్తిగత గోప్యతా హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తుండడం తెలిసిందే.


Akira Nandan
Pawan Kalyan
AI Love Story
deepfake
Delhi High Court
artificial intelligence
privacy rights
social media
Sambhavami Studios
fake content

More Telugu News