Kanaka Rao: సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడంపై టీడీపీ నేతల తీవ్ర అసంతృప్తి
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కనకారావు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు
- టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారని తెలుగు తమ్ముళ్ల మండిపాటు
- పక్షపాత పోలీసింగ్‌కు గుర్తింపు ఇవ్వడమేంటి? అని ప్రశ్న
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆ ఘటనలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి, కార్లకు నిప్పంటించి పార్టీ ఆఫీస్‌ను పూర్తిగా దగ్ధం చేశారు. అయితే, అప్పటి సీఐ కనకారావు, గన్నవరం పోలీసులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఘటన అనంతరం టీడీపీ నేతలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట ఘర్షణకు దారితీసింది. వైసీపీ నాయకులు రాళ్లు రువ్వడంతో సీఐ కనకారావుకు తలకు గాయమైంది. కానీ, దాడికి కారణమైన వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. మరోవైపు, నాడు మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ కార్యాలయం దగ్ధమైన విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి గన్నవరం రాగా, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ జాషువా ఎయిర్‌పోర్ట్ ముందు భారీ వాహనాలను అడ్డుపెట్టి చంద్రబాబును గన్నవరం రాకుండా అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం నాడు సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. "దాడి చేసినవారిని వదిలేసి, టీడీపీ నేతలపై కేసులు పెట్టిన అధికారికి ఇప్పుడు ప్రశంసలా? ఇది న్యాయమా?" అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. "పక్షపాత పోలీసింగ్‌కు గుర్తింపు ఇవ్వడమేంటి?" అని మండిపడుతున్నారు.