Narendra Modi: మాల్దీవులపై ప్రధాని మోదీ పోస్టును వివాదాస్పదంగా అనువదించిన 'గ్రోక్'

Narendra Modi Post on Maldives Misinterpreted by Grok
  • గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాల్దీవులు అధ్యక్షుడు
  • ఇరుదేశాల ప్రయోజనం కోసం పనిచేస్తామని మోదీ ట్వీట్
  • మాల్దీవులు ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొందని మోదీ రాసినట్లు గ్రోక్ అనువాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులపై రాసిన పోస్టును 'ఎక్స్' ఏఐ సాధనం 'గ్రోక్' మార్చివేయడం చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాల్దీవుల నుంచి వచ్చిన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపుతూ సమాధానమిచ్చారు. అయితే 'గ్రోక్' ఈ దౌత్యపరమైన సందేశాన్ని మార్చివేయడం పలు విమర్శలకు తావిచ్చింది.

77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపుతూ 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు. ఇరుదేశాల్లో ప్రజల ప్రయోజనం కోసం కలిసి పనిచేస్తామని, మాల్దీవుల ప్రజల శ్రేయస్సుతో పాటు వారికి ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన మాల్దీవులు అధికారిక భాష 'దివేహి'లో పేర్కొన్నారు.

అయితే 'ఎక్స్' ఏఐ సాధనం 'గ్రోక్' మోదీ పేర్కొన్న సందేశాన్ని వివాదాస్పదంగా మార్చి ఆంగ్లంలోకి అనువదించింది. "మాల్దీవుల్లో భారత 77వ స్వాతంత్ర వేడుకలు జరిగాయి. అందులో మాల్దీవుల ప్రభుత్వం పాల్గొన్నది. ఈ ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంది" అని వివాదాస్పదంగా అనువదించింది. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం స్థానంలో స్వాతంత్ర దినోత్సవం అని అనువాదం చేయడం గమనార్హం.

దీంతో 'ఏఐ' మీద పూర్తిగా ఆధారపడటం మంచిది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ ఫీచర్లన్నీ ప్రయోగదశలో ఉన్నాయని సంబంధిత సంస్థలు కూడా చెబుతున్నాయి. మహిళలు, చిన్నారుల అసభ్యకర చిత్రాలను గ్రోక్ సృష్టిస్తోందంటూ ఇదివరకే భారత్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
Narendra Modi
Maldives
Grok AI
X AI tool
Mohamed Muizzu
Republic Day
Diplomacy
AI translation error

More Telugu News