Shashi Tharoor: మోదీకి దగ్గరవుతున్న శశిథరూర్.. దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Shashi Tharoor Getting Closer to Modi Congress High Command Ready for Damage Contro
  • కొన్ని రోజులుగా బీజేపీతో సన్నిహితంగా శశిథరూర్
  • త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు
  • శశిథరూర్ తో ప్రైవేట్ చర్చలకు ప్లాన్

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో సన్నిహితంగా కనిపిస్తున్నారు. ప్రధాని మోదీని పదే పదే మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి కూడా శశిథరూర్ హాజరు కాలేదు. దీంతో పార్టీలో విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.


కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో, ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం కలిగించవచ్చని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. శశిథరూర్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు సీనియర్ నేతలు ఆయనను ప్రైవేట్‌గా ఆహ్వానించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది బహిరంగ వేదికపై కాకుండా, పార్టీ అంతర్గతంగా జరగాలని భావిస్తున్నారు.


ఈ నేపథ్యంలో శశిథరూర్ తన స్పందన వెల్లడించారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ, "నా సొంత పార్టీ నాయకత్వంతో చర్చించాల్సిన సమస్యలు ఉన్నాయి. బహిరంగ వేదికపై కాదు... నేను పార్లమెంటు కోసం ఢిల్లీకి వెళ్తాను. నా ఆందోళనలను పార్టీ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేయడానికి.. వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి.. సరైన సంభాషణ జరపడానికి నాకు అవకాశం లభిస్తుందని నేను నమ్ముతున్నాను" అన్నారు. "నేను గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. మనం ఎక్కువ దూరం వెళ్లకూడదు. నా విషయానికొస్తే.. ఏదైతో తప్పు జరిగిందో.. దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తగిన వేదికలో అది పరిష్కరించబడుతుంది" అని స్పష్టం చేశారు.


శశిథరూర్ ఇటీవలి వ్యాఖ్యల్లో ప్రధాని మోదీని ప్రశంసించడం, బీజేపీ నేతలతో సన్నిహితంగా కనిపించడం పార్టీలో చర్చకు దారితీసింది. మోదీ రాజ్యాంగాన్ని పవిత్రంగా భావిస్తారని, దానిని తిరస్కరించిన వారిని తనిఖీ చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. రాహుల్ గాంధీతో జరిగిన కీలక మీటింగ్‌కు హాజరు కాకపోవడం విభేదాలను మరింత బహిర్గతం చేసింది.


కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ విషయాన్ని పరిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పార్టీ ఐక్యత ముఖ్యమని సీనియర్లు భావిస్తున్నారు. శశిథరూర్‌తో ప్రైవేట్ చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. మరి ఈ చర్చలు ఎలా సాగుతాయి? శశిథరూర్ పార్టీలోనే కొనసాగుతారా? లేక మరో మార్గం ఎంచుకుంటారా? అనేవి రాబోయే రోజుల్లో తేలనున్నాయి.

Shashi Tharoor
Congress
Narendra Modi
Kerala Assembly Elections
Rahul Gandhi
BJP
Indian National Congress
Thiruvananthapuram

More Telugu News