ఐఐటీ డైరెక్టర్‌కు 'పద్మశ్రీ'.. జోహో ఫౌండర్‌కు 'గోమూత్రం' సవాల్‌!

  • కంప్యూటర్ ఆర్కిటెక్చర్, 'శక్తి' ప్రాసెసర్ రూపకల్పనలో వి.కామకోటికి పద్మశ్రీ
  • ఆయన విశేష కృషికిగాను పద్మశ్రీ పురస్కారం
  • గోమూత్రంలో ఔషధ గుణాలపై గతంలో కామకోటి వ్యాఖ్యలు
  • వాటిని గుర్తుచేస్తూ  కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
  • కామకోటిని సమర్థించిన జోహో అధినేత
  • ఆవు మూత్రంపై మీరే స్వయంగా రీసెర్చ్ చేయొచ్చు కదా అని కాంగ్రెస్ ఎదురుదాడి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి ఎంపిక కావడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశీయంగా 'శక్తి' మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రకు ఈ గౌరవం దక్కింది. అయితే, ఈ ఎంపికపై కేరళ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ పెద్ద దుమారమే రేపింది.

గతేడాది ఒక కార్యక్రమంలో కామకోటి మాట్లాడుతూ.. ఆవు మూత్రానికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయని, అది అనేక వ్యాధులను నయం చేయగలదని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు చేస్తూ కేరళ కాంగ్రెస్ "పద్మశ్రీ వచ్చినందుకు అభినందనలు.. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిన మీ పరిశోధనలను దేశం గుర్తించింది" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది.

కాంగ్రెస్ వ్యాఖ్యలను జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తీవ్రంగా తప్పుబట్టారు. కామకోటి ఒక గొప్ప పరిశోధకుడని, ఆయన అర్హతలను తక్కువ చేసి చూడటం 'బానిసత్వ వలస మానసిక స్థితికి' నిదర్శనమని మండిపడ్డారు. మన దేశీయ విజ్ఞానాన్ని తక్కువ చేయవద్దని, ఆవు మూత్రం, పేడలో ఉండే సూక్ష్మజీవుల వల్ల కలిగే ప్రయోజనాలను సైన్స్ కూడా గుర్తిస్తోందని ఆయన సమర్థించారు.

వెంబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అంతే వేగంగా స్పందించింది. "మీరు అంతగా నమ్ముతున్నప్పుడు, ఒక బిలియనీర్ అయిన మీరే ఆవు మూత్రం, పేడపై రీసెర్చ్ చేయడానికి మీ కంపెనీ ద్వారా నిధులు ఎందుకు కేటాయించకూడదు? ఒకవేళ గోమూత్రం ద్వారా క్యాన్సర్ నయమైతే అది ప్రపంచానికే గొప్ప మేలు అవుతుంది కదా.. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మీ మాటను నిలబెట్టుకోండి" అని ప్రతి సవాల్ విసిరింది.


More Telugu News