దక్షిణ కొరియాకు ట్రంప్ భారీ షాక్.. ఎగుమతులపై టారిఫ్‌ల పెంపు

  • వాణిజ్య ఒప్పందం ఆమోదంలో జాప్యమే కారణమని వెల్లడి
  • 15 శాతం నుంచి 25 శాతానికి పెరిగిన సుంకాలు
  • ఆకస్మిక ప్రకటనతో అప్రమత్తమైన దక్షిణ కొరియా
  • చర్చల కోసం అమెరికాకు హుటాహుటిన కొరియా వాణిజ్య మంత్రి
అమెరికా మిత్రదేశమైన దక్షిణ కొరియాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించడంలో దక్షిణ కొరియా శాసనసభ విఫలమైందని ఆరోపిస్తూ.. ఆ దేశ ఎగుమతులపై టారిఫ్‌లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఆందోళన మొదలైంది.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఈ మేరకు పోస్ట్ చేసిన ట్రంప్, సుంకాలను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆటోమొబైల్స్, కలప, ఫార్మా ఉత్పత్తులతో పాటు పలు ఇతర వస్తువులకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. "అమెరికాతో చేసుకున్న ఒప్పందానికి దక్షిణ కొరియా కట్టుబడి ఉండటం లేదు. వారి శాసనసభ ఎందుకు దానిని ఆమోదించలేదు?" అని ట్రంప్ ప్రశ్నించారు. అయితే, సోమవారం రాత్రి వరకు ఈ పెంపునకు సంబంధించి వైట్‌హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.

ట్రంప్ ఆకస్మిక ప్రకటనపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం (చియాంగ్ వా డే) స్పందించింది. టారిఫ్‌ల పెంపుపై తమకు అమెరికా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు అధ్యక్ష విధాన డైరెక్టర్ కిమ్ యోంగ్-బియోమ్ మంగళవారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించినట్లు వెల్లడించింది. అలాగే, కెనడా పర్యటనలో ఉన్న వాణిజ్య మంత్రి కిమ్ జంగ్-క్వాన్ వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లి వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్‌తో చర్చలు జరపనున్నట్లు పేర్కొంది.

గతేడాది కుదిరిన వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోని సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్ వంటి కీలక పరిశ్రమలలో 350 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సియోల్ అంగీకరించింది. అయితే, దీనికి సంబంధించిన బిల్లు నవంబర్ నుంచి పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. ఎగుమతులపైనే అధికంగా ఆధారపడే దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ తాజా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. చైనా తర్వాత అమెరికానే దక్షిణ కొరియాకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కావడం గమనార్హం.


More Telugu News