US Winter Storm: అమెరికాలో మంచు ప్రళయం: 29 మంది బలి.. అంధకారంలో కోట్లాది మంది!

US Winter Storm Kills 29 Millions Without Power
  • దేశవ్యాప్తంగా శీతల గాలులు, మంచు వర్షం 
  • అంధకారంలో టెన్నెస్సీ, మిస్సిసిపీ సహా పలు రాష్ట్రాలు
  • 19,000కు పైగా విమాన సర్వీసులు రద్దు
  • రహదారులపై మంచు పేరుకుపోవడంతో  స్తంభించిన రోడ్డు రవాణా
అగ్రరాజ్యం అమెరికాను 'ఫెర్న్' మంచు తుఫాను వణికిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం, గడ్డకట్టే మంచు వర్షం దేశంలోని దాదాపు 40 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించిన ఈ తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

తీవ్రమైన చలికి తట్టుకోలేక వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 29 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ నగరంలో మైనస్ ఉష్ణోగ్రతల వల్ల బయట నివసించే ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, టెక్సాస్, లూసియానాలో హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం) వల్ల పలువురు మరణించారు. మిస్సిసిపీలో సంభవించిన చారిత్రక ఐస్ స్టార్మ్ వల్ల భారీగా చెట్లు విరిగిపడటంతో పాటు రోడ్లు ప్రమాదకరంగా మారాయి.

మంచు భారం వల్ల విద్యుత్ లైన్లు తెగిపోవడంతో అనేక రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క టెన్నెస్సీలోనే 3 లక్షల మందికి పైగా కరెంట్ లేక అవస్థలు పడుతుండగా, మిస్సిసిపీలో 1.5 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో, కేవలం 10 నిమిషాల పాటు బయట ఉన్నా చర్మం గడ్డకట్టే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తుఫాను ప్రభావంతో విమానయాన రంగం కుప్పకూలింది. ఇప్పటివరకు 19,000 విమానాలు రద్దు కాగా, వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న ఈ చలిగాలుల ప్రభావం మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
US Winter Storm
Fern winter storm
America snow storm
Texas power outage
New York cold weather deaths
Mississippi ice storm
US weather emergency
winter storm 2024
hypothermia deaths
Arctic blast

More Telugu News