India EU FTA: భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: రక్షణ నుంచి ఉపాధి వరకు కొత్త చరిత్ర!

India EU FTA deal opens new chapter in trade and employment
  • 2007లో మొదలైన చర్చలు
  • 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తుది దశకు
  • రక్షణ రంగంలో సాంకేతిక సహకారం
  • భారతీయులకు యూరప్‌లో ఉపాధి అవకాశాలు
  • ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వందల బిలియన్ డాలర్లకు చేరడమే లక్ష్యం
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య సాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ఒక చారిత్రక మైలురాయిని చేరుకున్నాయి. గత 19 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఒప్పందం సాకారమైతే అటు రక్షణ రంగం నుంచి ఇటు సామాన్యుల ఉపాధి వరకు విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 2007లో అంకురార్పణ జరిగిన ఈ చర్చలు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకోవడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం వస్తువుల కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాకుండా.. ఈ ఒప్పందంలో రక్షణ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. యూరప్ దేశాల నుంచి అత్యాధునిక రక్షణ సాంకేతికత భారత్‌కు బదిలీ కానుంది. దీనివల్ల 'మేక్ ఇన్ ఇండియా' పథకానికి మరింత బలం చేకూరడమే కాకుండా, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది.

ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం 'వర్కర్ మొబిలిటీ'. భారతీయ నిపుణులు, ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, వైద్య రంగాలకు చెందిన వారు యూరప్ దేశాలకు వెళ్లి పనిచేయడానికి ఉన్న నిబంధనలు సరళతరం కానున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు, పని అనుమతుల్లో వెసులుబాటు వంటి అంశాలు మన యువతకు యూరప్ తలుపులు బార్లా తెరవనున్నాయి.

2007లో చర్చలు ప్రారంభమైనప్పటికీ.. సుంకాలు, డేటా ప్రైవసీ, మేధో సంపత్తి హక్కుల వంటి అంశాలపై భిన్నాభిప్రాయాల వల్ల 2013లో చర్చలు నిలిచిపోయాయి. అయితే, 2021-22 నుంచి ఇరు పక్షాలు మళ్లీ దూకుడు పెంచాయి. తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యూరప్ భావిస్తుండటం భారత్‌కు సానుకూలంగా మారింది.

ఈ ఒప్పందం గనుక పూర్తిస్థాయిలో అమలైతే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం (భారత్), అతిపెద్ద వాణిజ్య బ్లాక్ (ఈయూ) మధ్య ఒక కొత్త ఆర్థిక శకం మొదలవుతుంది. ఇది భారత జీడీపీ వృద్ధికి ఇంధనంగా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
India EU FTA
India
European Union
Free Trade Agreement
Trade deal
Worker mobility
Make in India
Defense technology
India Europe relations

More Telugu News