Gold Price: ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?

Gold Price May Reach Rs 22 Lakhs Soon
  • ప్రస్తుతం రూ. 1.6 లక్షల వద్ద ధర ఊగిసలాట
  • ఈ ఏడాది చివరి నాటికి రూ. 2 లక్షలు దాటుతుందని లండన్ బులియన్ మార్కెట్ అంచనా
  • గతంలో ధర రెట్టింపు కావడానికి నాలుగేళ్ల సమయం
  • ఇప్పుడు రెండేళ్ల కాలంలోనే ధర రెట్టింపు
  • పసిడి నిల్వలు పెంచుకుంటున్న భారత్
బంగారం కొనాలంటేనే సామాన్యుడు భయపడే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 1.6 లక్షల వద్ద ఊగిసలాడుతుండగా, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది చివరకల్లా పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2.2 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.

గడిచిన రెండు దశాబ్దాల కాలాన్ని గమనిస్తే పసిడి ధరలు పెరిగే వేగం ఊహాతీతంగా మారింది. 2007లో 10 గ్రాములు రూ. 10 వేలు ఉన్న ధర, అది రెట్టింపు కావడానికి (రూ. 20 వేలు) నాలుగేళ్లు పట్టింది. కానీ, రూ. 80 వేల స్థాయి నుంచి ఇప్పుడున్న రూ. 1.6 లక్షలకు చేరడానికి కేవలం రెండేళ్ల కాలం సరిపోయింది. అంటే పెరుగుదల రేటులో వేగం భారీగా పెరిగింది. 2026 ప్రారంభమైన ఈ 26 రోజుల్లోనే పసిడి ఏకంగా 18 శాతం ఎగబాకడం గమనార్హం.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు ఇతర దేశాలను భయపెడుతున్నాయి. డాలర్ నిల్వలపై ఆధారపడటం ప్రమాదకరమని భావించి, భారత్ సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కొనుగోళ్లను ముమ్మరం చేశాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు, డాలర్ విలువలో అస్థిరతకు కారణమవుతున్నాయి. డాలర్ బలహీనపడిన ప్రతిసారీ ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ధరలు ఇంకా పెరిగిపోతాయనే భయంతో సాధారణ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ కారణంగానే ధరలు అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అనిశ్చితిని భారత్ ముందుగానే పసిగట్టింది. 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద 880 టన్నుల బంగారం ఉంది. ఇందులో 512 టన్నులు మన దేశంలోనే భద్రంగా ఉండగా, మిగిలిన నిల్వలు బ్రిటన్ వంటి విదేశీ బ్యాంకుల్లో కస్టడీలో ఉన్నాయి. 8,000 టన్నుల నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది.

మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్సు ధర 7,000 డాలర్లకు చేరితే.. స్థానిక మార్కెట్లో పసిడి సామాన్యుడికి కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, కొనే ఆలోచన ఉన్నవారు ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Gold Price
Gold
Gold rate
RBI
Reserve Bank of India
Gold investment
US Dollar
India gold reserves
Gold market
London Bullion Market Association

More Telugu News