Rajeev Shukla: బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ తప్పుదోవ పట్టిస్తోంది: రాజీవ్ శుక్లా

Rajeev Shukla says Pakistan misleading Bangladesh on T20 World Cup
  • పాకిస్థాన్ స్వలాభం కోసం దురుద్దేశంతో బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతోందని విమర్శ
  • బంగ్లాదేశ్‌కు భారత్‌లో పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చామన్న రాజీవ్ శుక్లా
  • బంగ్లాదేశీయులపై పాక్ ఎలాంటి దారుణాలకు పాల్పడిందో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్య
టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ ఆడాలని భారత్ కోరుకుంటోందని, అయితే పాకిస్థాన్ మాత్రం వారిని తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతోందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆరోపించారు. పాకిస్థాన్ తమ స్వప్రయోజనాల కోసం దురుద్దేశంతో బంగ్లాదేశ్‌ను ప్రేరేపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొంటే, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే, తాము శ్రీలంకలో మాత్రమే ఆడుతామని వారు పట్టుబట్టడంతో, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చడం సాధ్యం కాకపోవడంతో స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

ఈ వ్యవహారంలో పాకిస్థాన్ అనవసరంగా జోక్యం చేసుకుంటోందని ఆయన విమర్శించారు. బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశీయులపై పాకిస్థాన్ ఎలాంటి దారుణాలకు పాల్పడిందో ప్రపంచానికి తెలుసని, ఆ దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్ ఎంత నష్టపోయిందో వారికి తెలుసని ఆయన అన్నారు. పాకిస్థాన్ శ్రేయోభిలాషిగా నటిస్తూ బంగ్లాదేశ్‌ను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు.
Rajeev Shukla

More Telugu News