Asaduddin Owaisi: మూడు రంగుల జెండాతో, 'యే దేశ్ మేరే' అంటూ... ట్రయంఫ్ బైక్‌పై పాతబస్తీలో అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi Celebrates Republic Day with Bike Ride in Old City
  • పాతబస్తీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ
  • బైక్‌పై జాతీయ జెండాలు పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఒవైసీ
  • 1 నిమిషం 15 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో పోస్టు చేసిన అసదుద్దీన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ కార్యాలయం, మదీనా చౌరస్తాలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ట్రయంఫ్ బైక్‌పై పాతనగరంలో పర్యటించారు. బైక్‌పై రెండు చిన్న జాతీయ జెండాలను అమర్చుకుని, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

పాతబస్తీలో తన పర్యటనకు సంబంధించిన వీడియోను అసదుద్దీన్ ఒవైసీ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోకు ఆయన తన ప్రసంగంలోని కొంత భాగాన్ని, అజయ్ దేవగణ్, సంజయ్ దత్ నటించిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలోని 'యే దేశ్ మేరే' పాటను జత చేశారు. 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంగా ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. "నా తోటి భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రానంతరం భారతదేశాన్ని మన పెద్దలు గణతంత్ర రాజ్యంగా నిలపాలని ఆకాంక్షించారు. నియంతృత్వ పాలన, మెజారిటీ రాజ్య పాలనను వారు కోరుకోలేదు. గణతంత్రంలో ప్రతి స్వరం ముఖ్యమైనది. మన భారతదేశం అందరికీ నిలయంగా ఉండాలని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం కేవలం హామీలుగా కాకుండా వాస్తవ రూపం దాల్చాలని నేను ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.
Asaduddin Owaisi
Hyderabad
Republic Day
Majlis Party
Triumph Bike
Old City
India Pakistan War 1971

More Telugu News