అర్దరాత్రి వేళ చెరువులో చిక్కుకుపోయిన వారిని కాపాడిన హైడ్రా-డీఆర్ఎఫ్

  • మిరాలం చెరువులో చిక్కుకుపోయిన 9 మంది సిబ్బంది
  • బోటు ఇంజన్ మొరాయించడంతో అర్ధరాత్రి ఉత్కంఠ
  • రంగంలోకి దిగి సాహసోపేతంగా కాపాడిన హైడ్రా-డీఆర్ఎఫ్ బృందాలు
  • రెండు విడతల్లో బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన వైనం
  • హైడ్రా-డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
హైదరాబాద్‌లోని మిరాలం చెరువులో చిక్కుకుపోయిన 9 మందిని హైడ్రా-డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఆదివారం అర్ధరాత్రి బోటు ఇంజన్ మొరాయించడంతో చెరువు మధ్యలోనే ఉండిపోయిన ఇంజనీర్లు, కార్మికులను సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. పాతబస్తీలోని జూ పార్కు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన, తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే... మిరాలం చెరువుపై నిర్మించతలపెట్టిన వంతెన కోసం సాయిల్ టెస్ట్ చేసేందుకు కొంతమంది ఇంజనీర్లు, కార్మికులు ఆదివారం ఉదయం బోటులో చెరువులోకి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా, చీకటి పడే సమయానికి వారు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ ఆగిపోయింది. దాన్ని బాగుచేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒడ్డున ఉన్న మెకానిక్‌కు ఫోన్ చేయగా, బోటు ఒడ్డుకు వస్తేనే బాగుచేయగలనని చెప్పడంతో వారిలో ఆందోళన మొదలైంది.

బోటును చేతులతో నెట్టుకుంటూ ఒడ్డుకు వద్దామని ప్రయత్నించగా, చెరువులో దట్టంగా పెరిగిన గుర్రపు డెక్క అడ్డుగా మారింది. దీంతో బోటు ముందుకు కదలలేదు. చుట్టూ చిమ్మచీకటి, మరోవైపు ఆ చెరువులో మొసళ్లు ఉంటాయనే భయంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ వెంటనే స్పందించింది.

హైడ్రా ఎస్ఎఫ్‌ఓ జమీల్, రెస్క్యూ టీమ్ ఇన్‌చార్జి స్వామి నేరుగా చెరువులో చిక్కుకున్నవారితో ఫోన్‌లో మాట్లాడారు. "మేము వస్తున్నాం, ఎంత రాత్రైనా మిమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం, ధైర్యంగా ఉండండి" అని భరోసా ఇచ్చారు. దట్టమైన చీకటి, గుర్రపు డెక్క కారణంగా బాధితులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం డీఆర్ఎఫ్ సిబ్బందికి సవాలుగా మారింది. బాధితులు తమ సెల్ ఫోన్ లైట్ల ద్వారా సిగ్నల్ ఇవ్వగా, డీఆర్ఎఫ్ బృందాలు టార్చ్ లైట్ల సాయంతో అతి కష్టం మీద వారి వద్దకు చేరుకున్నాయి. మొదటి విడతలో నలుగురిని, ఆ తర్వాత రెండో విడతలో మిగిలిన ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఒడ్డుకు చేరడంతో బాధితులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో తమను కాపాడిన హైడ్రా-డీఆర్ఎఫ్ బృందాలకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పడమే కాకుండా, సాహసోపేతంగా తమను కాపాడారని కార్మికులు, స్థానికులు కొనియాడారు.


More Telugu News