Lakshmi Madhuri: బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి... పక్కా ప్లాన్‌తో భర్తను చంపేసింది: గుంటూరు పోలీసులు

Lakshmi Madhuri Arrested for Husbands Murder in Guntur
  • అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
  • ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ఘాతుకం
  • బిర్యానీలో నిద్రమాత్రలు ఇచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
  • సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం.. వారం రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు
  • నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన గుంటూరు ఎస్పీ
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ఓ భార్య అతి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించి భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం మీడియాకు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే, చిలువూరు గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు (42) ఈ నెల 18న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్యాస్ సమస్య కారణంగా గుండెపోటుతో సహజంగానే చనిపోయాడని అతని భార్య లక్ష్మీమాధురి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అనుమానం వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శవపరీక్షలో శివనాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనుమానిత మృతిగా కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లక్ష్మీమాధురికి, సత్తెనపల్లికి చెందిన గోపీకి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. 2007లో శివనాగరాజుతో వివాహం జరగగా, తర్వాత విజయవాడలోని ఓ సినిమా హాల్‌లో పనిచేస్తున్నప్పుడు గోపీతో పరిచయం ఏర్పడింది. ఈ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మీమాధురి, అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది.

పథకం ప్రకారం, గోపీ తన స్నేహితుడైన ఆర్‌ఎంపీ డాక్టర్ సురేశ్ వద్ద నుంచి నిద్రమాత్రలు తెచ్చి లక్ష్మీమాధురికి ఇచ్చాడు. ఈ నెల 18న రాత్రి ఆమె బిర్యానీలో ఆ నిద్రమాత్రల పొడిని కలిపి భర్తకు పెట్టింది. అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక, ఆమె తన ప్రియుడు గోపీని, అతని స్నేహితుడు సురేశ్‌ను ఇంటికి పిలిపించింది. ముగ్గురూ కలిసి అపస్మారక స్థితిలో ఉన్న శివనాగరాజును దిండుతో ఊపిరాడకుండా చేశారు. గుండెలపై రొట్టెల కర్రతో బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత ప్రియుడు వెళ్లిపోగా, ఆమె రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.

తన వివాహేతర సంబంధం గురించి తెలియడంతో భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు లక్ష్మీమాధురి పోలీసుల విచారణలో అంగీకరించింది. టెక్నికల్ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు, నిందితులైన లక్ష్మీమాధురి, గోపీ, సురేశ్‌లను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన వారం రోజుల్లోనే కేసును ఛేదించిన మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకట రవి, వారి సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు.
Lakshmi Madhuri
Guntur
murder
extra marital affair
sleep pills
biryani
crime news
Duggirala
Sattanapalli
lover

More Telugu News