Kodandaram: కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, అసంతృప్తి ఉంది: కోదండరాం సంచలన వ్యాఖ్యలు

Kodandaram Sensational Comments on Congress Government Dissatisfaction
  • ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతామన్న కోదండరాం
  • మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న కోదండరాం
  • కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి నెలకొన్నాయని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీకి తమ నిర్ణయాన్ని తెలియజేశామని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని సంప్రదించామని, ఆ పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. తాము మాత్రం పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డపై ఉందని కోదండరాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ కానివ్వబోమని ఉద్ఘాటించారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని ఆయన వెల్లడించారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం, విచారణ సమయంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

అమరవీరుల త్యాగంతో సాధించిన తెలంగాణలో ప్రజలు పదేళ్లు అధికారమిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన అంతం కావాలని, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఒక ప్రయత్నం జరగాలని, ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నామని ఆయన అన్నారు. ఈ కారణాల వల్లే తామంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికామని కోదండరాం తెలిపారు.
Kodandaram
Telangana
Congress government
Municipal elections
Singareni
BRS party
Phone tapping

More Telugu News