KTR: రేపు గవర్నర్‌ను కలవనున్న కేటీఆర్ బృందం

KTR to Meet Governor Regarding Singareni Corruption Allegations
  • సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణ
  • సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఉందని ఆరోపణ
  • గవర్నర్‌కు సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను ఇవ్వనున్న కేటీఆర్ బృందం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు కలవనుంది. సింగరేణి వ్యవహారంపై వారు గవర్నర్‌కు సమగ్ర వివరాలు అందజేయనున్నారు. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర ఉందని ఆరోపిస్తూ వారు సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను గవర్నర్‌కు సమర్పించనున్నారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ల నిబంధనలను మార్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సుమారు రూ.6 వేల కోట్ల విలువైన టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను తీసుకువచ్చి, తమకు కావలసిన సంస్థలకే టెండర్లు దక్కేలా చేశారని ఆరోపిస్తున్నారు. సింగరేణికి రావాల్సిన లాభాలను పక్కదారి పట్టించి, ఎన్నికల ఖర్చులు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణి టెండర్ల ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు న్యాయమూర్తితో లేదా సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
KTR
K Taraka Rama Rao
Telangana
Governor
Revanth Reddy
Singareni Collieries
Corruption

More Telugu News