గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి.. మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం

  • మక్తల్ గణతంత్ర వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం
  • జెండా ఎగరేస్తుండగా మధ్యలోకి విరిగిపడిన కర్ర
  • వేగంగా పక్కకు జరిగి సురక్షితంగా బయటపడ్డ మంత్రి
  • ఘటనలో మరో వ్యక్తికి స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
నారాయణపేట జిల్లా మక్తల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేస్తుండగా, జెండా కర్ర విరిగిపడటంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడగా, మరొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

వివ‌రాల్లోకి వెళితే... 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీహరి, మువ్వన్నెల జెండాను ఆవిష్కరించేందుకు తాడును లాగారు. అదే సమయంలో బరువును తట్టుకోలేక జెండా కర్ర మధ్యలోకి విరిగిపోయింది. విరిగిన కర్ర మంత్రిపై పడబోతుండగా, ఆయన అప్రమత్తమై వెంటనే పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అయితే, విరిగిన కర్ర ముక్క అక్కడే ఉన్న మరో వ్యక్తిపై పడటంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, అధికారులు అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వేడుకల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మంత్రి పాల్గొనే కార్యక్రమంలో నాణ్యత లేని కర్రను ఉపయోగించడంపై స్థానికులు అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు.

ప్రమాదం తర్వాత మంత్రి శ్రీహరి వేడుకలను కొనసాగించి జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. 


More Telugu News