'ప్రెస్' స్టిక్కర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై వారికే అనుమతి

  • నకిలీ జర్నలిస్టులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
  • వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్
  • అనధికారిక స్టిక్కర్లపై త్వరలో పోలీస్, రవాణా శాఖల స్పెషల్ డ్రైవ్
  • వృత్తి గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
మీడియా ముసుగులో చెలామణి అవుతున్న నకిలీ జర్నలిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్‌ను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) కమిషనర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

క్షేత్రస్థాయిలో కొందరు కేవలం యూట్యూబ్ ఛానెళ్లు లేదా ఇతర ప్రైవేటు సంస్థల ఐడీ కార్డులను చూపిస్తూ వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లను విరివిగా వాడుతున్నారని, దీనివల్ల అసలైన జర్నలిస్టుల ప్రతిష్ఠ‌కు భంగం కలుగుతోందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం-1989 ప్రకారం వాహనాలపై లేదా నంబర్ ప్లేట్లపై అనధికారికంగా 'ప్రెస్', 'పోలీస్', 'గవర్నమెంట్' వంటి పదాలను వాడటం చట్టరీత్యా నేరం.

ఈ కొత్త నిబంధనలను అతిక్రమించి అక్రిడిటేషన్ లేకుండా 'ప్రెస్' స్టిక్కర్లను వాడితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులకు భారీ జరిమానాతో పాటు అవసరమైతే వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా రవాణా శాఖకు ఉందని అధికారులు హెచ్చరించారు. అక్రిడిటేషన్ లేని వారు తమ వాహనాలపై ఉన్న స్టిక్కర్లను వెంటనే తొలగించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ జర్నలిస్టుల వల్ల తలెత్తుతున్న గందరగోళానికి తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అక్రిడిటేషన్ లేని నిజమైన ఫీల్డ్ రిపోర్టర్లకు ఇది కొంత ఇబ్బంది కలిగించే అవకాశమున్నప్పటికీ, జర్నలిజం వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు ఈ చర్య అవసరమని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News