Bangladesh: భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో మరో డిమాండ్

Bangladesh Textile Industry Demand to End Duty Free Access for Indian Yarn
  • నూలు దిగుమతులపై ఆంక్షలకు పట్టుబడుతున్న వస్త్ర పరిశ్రమ
  • భారత్ నూలుకు డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలంటూ ఆందోళన
  • లేదంటే ఫిబ్రవరి 1 నుంచి కర్మాగారాలు మూసివేస్తామని అల్టిమేటం
బంగ్లాదేశ్ లో నానాటికీ భారత వ్యతిరేకత పెరిగిపోతోంది. యూనస్ సర్కారు ధోరణితో భారత్– బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తుండగా.. తాజాగా ఆ దేశంలో మరో డిమాండ్ ఊపందుకుంది. భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలంటూ అక్కడి వస్త్ర పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం భారత నూలుకు కల్పిస్తున్న డ్యూటీ-ఫ్రీ సౌకర్యాన్ని వెంటనే తొలగించాలని పరిశ్రమ వర్గాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకోకుంటే వచ్చే నెల 1 నుంచి కర్మాగారాలు మూసివేస్తామని అల్టిమేటం జారీ చేశాయి.

ఈ మేరకు ఆ దేశ వాణిజ్యశాఖ నుంచి నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూకు లేఖ అందినట్లు యూనస్‌ ప్రభుత్వం పేర్కొంది. డ్యూటీ ఫ్రీ సదుపాయం వల్ల భారత్ నూలు దేశంలోకి చౌకగా దిగుమతవుతోందని, ఇది స్థానిక స్పిన్నింగ్ యూనిట్లను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నూలు దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ వస్త్ర పరిశ్రమలో 12 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన అమ్ముడుపోని నిల్వలు మిగిలిపోయాయని, 50కి పైగా వస్త్ర పరిశ్రమలు మూతపడి వేలాదిమంది నిరుద్యోగులుగా మారారని ఆరోపించారు.

వ్యతిరేకిస్తున్న ఎగుమతిదారుల సంఘం
భారత నూలుకు డ్యూటీ ఫ్రీ ఎత్తేయాలన్న వస్త్ర పరిశ్రమ డిమాండ్ ను బంగ్లాదేశ్ లోని ఎగుమతిదారుల సంఘం వ్యతిరేకిస్తోంది. దీనివల్ల భారత్ నుంచి నూలు దిగుమతులు తగ్గిపోతాయని చెప్పారు. నాణ్యత విషయంలో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్లు, ప్రపంచ దేశాలు భారత నూలుకు ప్రాధాన్యం ఇస్తాయని సంఘం నేతలు చెప్పారు. పైపెచ్చు స్థానికంగా ఉత్పత్తయ్యే నూలుతో పోలిస్తే భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న నూలు చౌక అని వివరించారు. భారత్ నుంచి నూలు దిగుమతులు తగ్గితే బంగ్లాదేశ్ లో తయారయ్యే దుస్తులు నాణ్యత, ఖరీదులో ప్రపంచ దుస్తుల మార్కెట్ లో నిలవలేవని ఆందోళన వ్యక్తం చేశారు.
Bangladesh
India Bangladesh relations
Bangladesh garment industry
Duty-free
Textile industry
Yunus government
Spinning units
Exports
Indian yarn
Trade

More Telugu News