Xi Jinping: గణతంత్ర దినోత్సవం వేళ.. జిన్‌పింగ్ నుంచి సానుకూల సందేశం

Xi Jinping Wishes India on 77th Republic Day
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు జిన్‌పింగ్ శుభాకాంక్షలు
  • డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేస్తున్నాయన్న చైనా అధ్యక్షుడు
  • గల్వాన్ ఘర్షణ తర్వాత మెరుగుపడుతున్న ఇరుదేశాల సంబంధాలు
  • గతేడాది మోదీ, జిన్‌పింగ్ భేటీతో మొదలైన సానుకూల మార్పు
భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, చైనాలు మంచి పొరుగు దేశాలని, స్నేహితులని, భాగస్వాములని ఆయన అభివర్ణించారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఈ వివరాలను వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య సంబంధాలను ఉద్దేశిస్తూ "డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేస్తున్నాయని" జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. దౌత్య సంబంధాలలో స్థిరత్వం కోసం ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని, ఒకరి ఆందోళనలను మరొకరు పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.

2020లో గల్వాన్ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత సుమారు నాలుగేళ్ల పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ భేటీ కావడంతో పరిస్థితుల్లో మార్పు మొదలైంది. అదే నెలలో సరిహద్దు ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.

గతేడాది జులైలో చైనాలో పర్యటించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. సంబంధాల సాధారణీకరణలో సాధించిన సానుకూల పురోగతిని కొనసాగించాలని సూచించారు. ఆ తర్వాత టిబెట్‌లోని కైలాస మానస సరోవరానికి భారత యాత్రికులను తిరిగి అనుమతించడం, వీసా విధానాలను సరళతరం చేయడం, ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించడం వంటి చర్యలతో సంబంధాలు మరింత బలపడ్డాయి.

కాగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతునున్నాయి. "వందేమాతరం-150 ఏళ్లు" అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
Xi Jinping
India
China
Republic Day
Droupadi Murmu
India China relations
Galwan Valley
Narendra Modi
S Jaishankar
BRICS summit

More Telugu News