ఆటగాళ్లకు బంగ్లా బోర్డు షాక్.. వివాదాస్పద అధికారికి కీలక పదవి

  • టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌పై ఐసీసీ వేటు
  • వివాదాస్పద అధికారి నాజ్ముల్ ఇస్లాంకు మళ్లీ ఫైనాన్స్ కమిటీ చీఫ్ పదవి
  • నాజ్ముల్ వ్యాఖ్యలపై గతంలో ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వైనం
  • ఆటగాళ్లను శాంతింపజేసి, మళ్లీ అదే అధికారికి బోర్డు బాధ్యతల అప్పగింత
  • బంగ్లా బోర్డు అంతర్గత రాజకీయాలపై వెల్లువెత్తుతున్న‌ విమర్శలు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ క్రికెట్‌ను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ అధికారికంగా తప్పించిన కొన్ని గంటల్లోనే.. బోర్డు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల నిరసనకు కారణమైన ఫైనాన్స్ కమిటీ చీఫ్ ఎం. నాజ్ముల్ ఇస్లాంను మళ్లీ అదే పదవిలో నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇటీవల బీసీబీ డైరెక్టర్ అయిన నాజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలతో ఈ సంక్షోభం మొదలైంది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను భారత ఏజెంట్ అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రపంచకప్ నుంచి వైదొలిగితే ఆటగాళ్లకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని, సరిగా ఆడనప్పుడు వారి నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆటగాళ్లు.. మహ్మద్ మిథున్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌)ను బహిష్కరించారు.

ఆటగాళ్ల నిరసనతో బీపీఎల్‌ ప్రసార ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీబీ వెనక్కి తగ్గింది. నాజ్ముల్‌ను ఫైనాన్స్ కమిటీ పదవి నుంచి తొలగించి, షోకాజ్ నోటీసు జారీ చేసింది. బోర్డు తమకు న్యాయం చేసిందని భావించిన ఆటగాళ్లు ఆందోళన విరమించి, మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు.

ఈ దేశీయ వివాదం సద్దుమణుగుతున్న వేళ, ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. భద్రతా కారణాలు చూపుతూ టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. అయితే, ఐసీసీ మాత్రం బంగ్లా ఆట‌గాళ్ల‌కు భ‌ద్ర‌త ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య లేద‌ని తేల్చింది. దీంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది.

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అత్యంత విడ్డూరమైన విషయం ఏమిటంటే.. వివాదానికి కారణమైన నాజ్ముల్ ఇస్లాంను బీసీబీ మళ్లీ అదే పదవిలో నియమించడం. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఆటగాళ్ల ప్రయోజనాల కంటే బోర్డులోని పాత తరం అధికారులను కాపాడుకోవడానికే బీసీబీ ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.


More Telugu News