ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమావేశంలో సహనం కోల్పోయిన బంగ్లాదేశ్ అధికారి

  • ఐసీసీ మీటింగ్‌లో అధికారులతో వాగ్వివాదానికి దిగిన బంగ్లాదేశ్ ప్రతినిధులు
  • భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్
  • శ్రీలంకకు మ్యాచ్‌లు మార్చాలన్న విజ్ఞప్తి తిరస్కరణ
  • ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లా స్థానంలోకి వచ్చిన స్కాట్లాండ్ జట్టు
వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల నెపంతో భారత్‌లో ఆడేందుకు మొండికేసిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక గత మూడు వారాలుగా ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

తాజా నివేదికల ప్రకారం ఐసీసీ నిర్వహించిన కీలక సమావేశంలో బంగ్లాదేశ్ ప్రతినిధి ఒకరు సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లా ప్రతినిధులు పట్టుబట్టారు. అయితే, భారత్‌లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని స్వతంత్ర ఏజెన్సీల నివేదికలు స్పష్టం చేయడంతో ఐసీసీ వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ క్రమంలో జరిగిన వాగ్వివాదం చర్చలను మరింత క్లిష్టతరం చేసింది.

చివరి ప్రయత్నంగా భారత్‌లో ఆడుతారో లేదో చెప్పాలని బంగ్లాదేశ్‌కు ఐసీసీ 24 గంటల అల్టిమేటం ఇచ్చింది. అయితే బంగ్లా నుంచి ఎటువంటి అధికారిక ధ్రువీకరణ రాకపోవడంతో ఐసీసీ తన అధికారాలను ఉపయోగించి ఆ జట్టుపై వేటు వేసింది. అత్యధిక ర్యాంకింగ్ (14వ స్థానం) కలిగి ఉండి, టోర్నీకి క్వాలిఫై కాని స్కాట్లాండ్‌కు ఈ అవకాశం కల్పించింది.

ఈ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్ గ్రూప్-సిలో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేసింది. కోల్‌కతా, ముంబై వేదికలుగా జరగాల్సిన మ్యాచ్‌ల్లో ఇకపై స్కాట్లాండ్ తలపడనుంది. మరోవైపు, బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశంలోనే మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బీసీబీ వర్గాలు వాపోతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ లేకపోవడం ఇదే తొలిసారి. 


More Telugu News