గణతంత్ర వేడుకల వేళ తప్పిన పెను ప్రమాదం: రాజస్థాన్‌లో 10 వేల కిలోల పేలుడు పదార్థాల సీజ్!

  • నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామంలో 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం
  • 2025 నవంబర్‌లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో వాడిన కెమికల్ ఇదేనని గుర్తింపు
  • పాత నేరస్తుడు సులేమాన్ ఖాన్ అరెస్ట్
  • రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
గణతంత్ర దినోత్సవానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్ పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నాగౌర్ జిల్లాలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై శనివారం అర్థరాత్రి మెరుపు దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 187 గోనె సంచుల్లో నింపిన 9,550 కిలోల 'అమ్మోనియం నైట్రేట్'ను చూసి అధికారులు సైతం విస్తుపోయారు.

గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఉగ్రవాదులు వాడింది కూడా ఇదే అమ్మోనియం నైట్రేట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా దాడుల్లో కేవలం కెమికల్ మాత్రమే కాకుండా, భారీ సంఖ్యలో డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి మైనింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. చట్టవిరుద్ధమైన మైనింగ్ కోసం ఈ పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు నిందితుడు చెబుతున్నప్పటికీ, గణతంత్ర దినోత్సవానికి ముందే ఇంత పెద్ద ఎత్తున నిల్వ చేయడం వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు నాగౌర్ పోలీసులు సమాచారం అందించారు. ఢిల్లీలో జరిగిన పాత పేలుడు ఘటనలతో ఈ నిందితుడికి ఏవైనా లింకులు ఉన్నాయా? అనే దానిపై కేంద్ర సంస్థలు సులేమాన్ ఖాన్‌ను ప్రశ్నించనున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో రాజస్థాన్‌తోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 


More Telugu News