Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు

Nara Lokesh Directs TDP MPs on Parliament Budget Sessions
  • టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా లోకేశ్ 
  • రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు వెల్లడి
  • శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని సూచన
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా దర్బార్‌లో మంత్రులు, ఎంపీలు కలిసి పాల్గొనడంతో పాటు, శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని నారా లోకేశ్ సూచించారు. ప్రస్తుతం రెండు సెషన్ల కింద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, మొదటి సెషన్ అనంతరం వచ్చే విరామ సమయంలో ప్రతి ఎంపీతో వ్యక్తిగతంగా సమావేశమై అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యలపై ఎంపీలు పూర్తి అవగాహనతో అప్‌డేట్‌గా ఉండాలని లోకేశ్ సూచించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ఎమ్మెల్యేల మధ్య బంధం మరింత బలపడేలా ఎంపీలు కృషి చేయాలని కోరారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు సానుకూలంగానే ఉన్నప్పటికీ, పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి చురుగ్గా పని చేయాలని, కార్యకర్తల సమస్యలను తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
Nara Lokesh
TDP
TDP MPs
Parliament Budget Sessions
Andhra Pradesh
Central Government
State Issues
Party Coordination
Public Grievances
Political News

More Telugu News