Chandrababu Naidu: ఈ బడ్జెట్ సెషన్‌లోనే అమరావతికి రాజముద్ర: ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Directs MPs on Amaravati Budget Session
  • జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం
  • అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై దృష్టి సారించాలని సూచన
  • పోలవరం, నల్లమల సాగర్, పూర్వోదయ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలకు స్పష్టం
  • వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు సాధించాలని ఆదేశం
రాష్ట్రాభివృద్ధిలో పార్లమెంట్ సభ్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై గట్టిగా గళం విప్పాలని, తమ నియోజకవర్గాల అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశం జరిగింది. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులపై ఎంపీలకు చంద్రబాబు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అమరావతికి రాజముద్ర.. ప్రాజెక్టులకు ప్రాధాన్యం

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదముద్ర వేయించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రంలోని మంత్రులు, అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకం, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని అన్నారు. 

ఫిబ్రవరిలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఎంపీలందరూ వర్చువల్‌గా పాల్గొని రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం కోసం నియమించిన ఎంపీలు, ఆయా శాఖలకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చంద్రబాబు తెలిపారు.

వివాదాలు వద్దు.. నీళ్లే ముఖ్యం

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో వివాదాలు వద్దని, మనకు కావాల్సింది నీళ్లు మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన తాజా అంచనాలను కేంద్రానికి సమర్పించామని, ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి ఇంకా రూ.12,000 కోట్లు రావాల్సి ఉందని సమావేశంలో ప్రస్తావించారు. 

2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వస్తే, రాష్ట్ర వాదనలను బలంగా వినిపించాలన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మంజీరాకు నీటిని తరలించినప్పుడు ఏపీ అభ్యంతరం చెప్పలేదని, అలాంటిది నల్లమల సాగర్‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదనే విషయాన్ని కేంద్రానికి స్పష్టంగా వివరించాలని ఎంపీలకు సూచించారు.

నిధుల సమీకరణే లక్ష్యం

పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లేన్ల రైల్వే ట్రాక్ సాధించేలా కృషి చేయాలని చంద్రబాబు కోరారు. రైల్వే శాఖ వద్ద భారీగా నిధులు అందుబాటులో ఉన్నాయని, ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో అవకాశాలను గుర్తించి, నిధులు సాధించాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రుల నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభలో కానీ, బయట కానీ కూటమి లక్ష్యాలకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని గట్టిగా హెచ్చరించారు.

జాతీయ అంశాలపైనా గళం విప్పండి

రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంలో చొరవ చూపాలని అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఎంపీలు తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఇది రాష్ట్రానికి ఉన్న సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తోందని ఎంపీలకు వివరించారు.


Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Budget Session
Polavaram Project
Nallamala Sagar Project
Central Funds
Parliament
TDP
Nara Lokesh

More Telugu News